-పోలీసుల ఆకస్మిక దాడిలో ఏడుగురు పట్టివేత
-నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు
-జూదం, గంజాయి, గుడుంబాపై ప్రత్యేక నిఘా
క్రైమ్ మిర్రర్, భూపాలపల్లి:- జయశంకర్ జిల్లా మహదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించి, పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.14,050 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసుల కథనం ప్రకారం.. మహదేవ్‌పూర్ లోకల్ ప్రాంతంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో ఎస్‌ఐ ఎం. సాంబమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దాడి నిర్వహించింది. ఈ దాడిలో పేకాట ఆడుతూ పట్టుబడిన ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న రూ.14,050 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మహదేవ్‌పూర్ ఎస్‌ఐ ఎం. సాంబమూర్తి మాట్లాడుతూ, పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు సమాజంలో నేరాలకు దారితీస్తాయని పేర్కొన్నారు. అలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట, గంజాయి విక్రయాలు, గుడుంబా తయారీ, జూదం, కోడిపందేలు, బెట్టింగ్ లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించేందుకు 8712658116 నంబర్‌కు లేదా అత్యవసర సేవల 112 లేదా 100 కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. సమాచారం అందించే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, ప్రజల సహకారంతో నేరాల నియంత్రణకు మరింత సమర్థవంతంగా చర్యలు చేపడతామని ఎస్‌ఐ ఎం. సాంబమూర్తి వెల్లడించారు. స్థానిక ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
సరిహద్దు దాటే ప్రయత్నం విషాదాంతం.. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వలసదారులు
