Homeతెలంగాణకరీంనగర్‌కు సిటీ బస్సుల శుభవార్త… మూడు రూట్లలో సేవలు ప్రారంభం

కరీంనగర్‌కు సిటీ బస్సుల శుభవార్త… మూడు రూట్లలో సేవలు ప్రారంభం

నగర ప్రజలకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సిటీ బస్సుల సేవలు మళ్లీ ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం అధికారికంగా ఈ బస్సులను ప్రారంభించనున్నారు. నగర విస్తీర్ణం వేగంగా పెరుగుతుండటం, పరిసర గ్రామాలు, మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలో విలీనం కావడంతో ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా అవసరం మరింత పెరిగింది.

ప్రతిరోజూ విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఉపాధి కోసం వేలాది మంది కరీంనగర్‌కు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుతూ సిటీ బస్సులు ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.

ప్రథమ దశలో కరీంనగర్ బస్టాండ్ నుంచి మూడు ముఖ్య రూట్లలో బస్సులను నడపనున్నారు. కరీంనగర్–చింకుంట, కరీంనగర్–కొత్తపల్లి (హవేలి), కరీంనగర్–వాగేశ్వరి కళాశాల మార్గాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. డిమాండ్‌ను బట్టి భవిష్యత్తులో బస్సుల సంఖ్యను పెంచే యోచనలో అధికారులు ఉన్నారు.

ఇప్పటికే హైదరాబాద్ నుంచి మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు కరీంనగర్‌కు చేరుకున్నాయి. వీటి ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

గతంలో కూడా సిటీ బస్సులను ప్రారంభించినప్పటికీ ప్రజాదరణ లభించకపోవడంతో అవి నిలిపివేయాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం నగర అభివృద్ధి, జనాభా పెరుగుదల దృష్ట్యా ఈ సారి సేవలు విజయవంతమవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సిటీ బస్సుల పునఃప్రారంభంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణం లభించనుంది.

also read: “మా కూతురును పెళ్లి చేసుకోండి”-  సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు పెళ్లి సంబంధాల వెల్లువ

తాజావార్తలు