Homeక్రైమ్చేపల వేటకు వెళ్లిన భర్త నదిలో గల్లంతు.. ప్రాణాలతో బయటపడిన భార్య

చేపల వేటకు వెళ్లిన భర్త నదిలో గల్లంతు.. ప్రాణాలతో బయటపడిన భార్య

క్రైం మిర్రర్ : కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లిన ఆదివాసీ గిరిజన దంపతుల్లో భర్త ప్రమాదవశాత్తు గల్లంతైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్య సురక్షితంగా బయటపడగా, భర్త ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అమరగిరి గ్రామ మాజీ ఉప సర్పంచ్ మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లాపూర్ మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని అమరగిరి చెంచు గూడెంకు చెందిన కాట్రాస్ బాలయ్య (35) తన భార్య నర్సమ్మతో కలిసి ఈ నెల 25వ తేదీ సాయంత్రం సమీపంలోని కృష్ణా నదికి చేపల వేట కోసం వెళ్లారు.

నది తీరంలోని కోతిగుండు ప్రాంతంలో చేపల వల వేస్తున్న సమయంలో ఒక్కసారిగా బలమైన గాలులు వీచడంతో పడవ అదుపుతప్పింది. ఈ క్రమంలో బాలయ్యకు ప్రమాదం సంభవించి నదిలో పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. భర్తను కాపాడేందుకు నర్సమ్మ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అనంతరం ఆమె అదే పడవలో రాత్రి వేళ గూడెంకు చేరుకుని కుటుంబ సభ్యులకు, గ్రామస్థులకు జరిగిన విషయాన్ని తెలియజేసింది.

ఈ ఘటనపై నర్సమ్మ ఆదివారం కొల్లాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించి గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం సాయంత్రం వరకు గూడెం వాసులు, మత్స్యకారులు వలల సాయంతో కృష్ణా నదిలో గాలించినప్పటికీ బాలయ్య ఆచూకీ లభించలేదని మాజీ ఉప సర్పంచ్ మల్లేష్ తెలిపారు. బాలయ్యకు భార్య నర్సమ్మతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద గల్లంతు కావడంతో అమరగిరి చెంచు గూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
also read : అల్లు అర్జున్‌ను హీరోగా తీసేసిన స్టార్ డైరెక్టర్.. షాకింగ్ నిజం బయటపెట్టిన టాప్ డైరెక్టర్…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు