క్రైం మిర్రర్ : సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్‌పై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతను గమనిస్తే భారీ ప్రాణనష్టం సంభవించే పరిస్థితి ఉన్నప్పటికీ, స్థానికుల చొరవతో ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. విజయవాడకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో కోదాడ బైపాస్ వద్దకు చేరుకున్న సమయంలో కారు అదుపు తప్పింది. వేగంగా వెళ్తున్న మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టి పలుమార్లు బోల్తా పడింది.
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న స్థానికులు స్పందించారు. కారులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదకర పరిస్థితుల్లో సాహసించి కారులో ఉన్న ఐదుగురినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అయితే కొద్దిసేపటికే కారులోని సీఏన్‌జీ గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. దీంతో బైపాస్‌పై కొంతసేపు భయాందోళన వాతావరణం నెలకొంది.
ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలు కావడంతో వెంటనే కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన నలుగురు ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. స్థానికుల సమయస్ఫూర్తి, ధైర్యంతో ఐదుగురి ప్రాణాలు కాపాడిన ఘటనపై పలువురు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.
also read : ఘోర రోడ్డు ప్రమాదం.. 35 మంది దుర్మరణం
