Homeక్రైమ్మిస్సింగ్ మిస్టరీకి తెర.. చత్తీస్‌గఢ్‌లో క్షేమంగా లభించిన ముగ్గురు బాలికలు

మిస్సింగ్ మిస్టరీకి తెర.. చత్తీస్‌గఢ్‌లో క్షేమంగా లభించిన ముగ్గురు బాలికలు

క్రైం మిర్రర్ : దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ముగ్గురు మైనర్ బాలికలను పోలీసులు చత్తీస్‌గఢ్‌లో సురక్షితంగా గుర్తించి రక్షించారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల సహాయంతో బాలికల ఆచూకీ కనుగొన్నారు. కేసు వివరాలను సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ కుటుంబం జీవనోపాధి కోసం ఈ ఏడాది మే నెలలో హైదరాబాద్‌కు వలస వచ్చింది. ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి సమయంలో అదే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలతో పాటు వారి బంధువైన మరో బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయారు. తెల్లవారుజామున విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు దోమలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ సహకారంతో 262 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. బాలికలు దోమలగూడ నుంచి ఆటోలో కాచిగూడ, అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో నాగ్‌పూర్ వెళ్లినట్లు గుర్తించారు. అనంతరం బస్సులో చత్తీస్‌గఢ్‌లోని గడ్‌చిరోలీ ప్రాంతం మీదుగా ఓ గ్రామానికి చేరుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

సాంకేతిక ఆధారాల ఆధారంగా చత్తీస్‌గఢ్ పోలీసులతో సమన్వయం చేసుకుని ముగ్గురు బాలికలను సురక్షితంగా గుర్తించి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ప్రాథమిక విచారణలో ఇంట్లో తరచూ జరుగుతున్న కుటుంబ గొడవల కారణంగా మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు బాలికలు వెల్లడించినట్లు డీసీపీ తెలిపారు. ప్రస్తుతం బాలికలను సఖి–భరోసా కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన ప్రక్రియలు పూర్తయిన అనంతరం వారిని తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డీసీపీ రక్షిత కృష్ణమూర్తి మాట్లాడుతూ, పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, భరోసా ఎంతో కీలకమని అన్నారు. కుటుంబ సభ్యులు పిల్లలతో సమయం గడుపుతూ వారి భావాలను అర్థం చేసుకోవాలని సూచించారు. ఈ కేసును వేగంగా ఛేదించిన దోమలగూడ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ అంజత్ అలీతో పాటు దర్యాప్తులో పాల్గొన్న ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు, సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని డీసీపీ అభినందించారు. సమావేశంలో అదనపు డీసీపీ నరసయ్య, ఏసీపీ ఏ. యాదగిరి పాల్గొన్నారు.
also read : మలక్‌పేట్ ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై సీపీ సజ్జనార్ సీరియస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు