-
భారీగా అభివృద్ధి పనులు
-
గ్రామాన్ని దత్తత తీసుకున్న కేసిఆర్
-
రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తానని హామీ
-
తరువాత బుట్ట దాఖలు
-
ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టిన సీఎం రేవంత్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ అవకాశాన్ని విడుచుకోవడం లేదు. గులాబీ పార్టీ వైఫల్యాలని సోఫానాలుగా మార్చుకున్నారు. ప్రధానంగా వాసాలమర్రి గ్రామం అభివృద్ధి పై ఫుల్ ఫోకస్ పెట్టారు. దానికి కారణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో సీఎంగా ఉన్నప్పుడు కెసిఆర్ ఈ వాసాలమర్రిని దత్తత తీసుకున్నారు.
గ్రామ రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి రూ.100 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయిస్తామని.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, మోడల్ పంచాయితీ భవనం, అత్యాధునిక పాఠశాలలు, విశాలమైన రోడ్లు నిర్మిస్తామని అప్పట్లో సహపంక్తి భోజనాలు చేసి మరి కెసిఆర్ ప్రకటించారు. కానీ అటు తరువాత ఆ గ్రామం ఎటువంటి అభివృద్ధి చెందలేదు.
-
కాగితాలకి పరిమితం..
గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ కాగితాలకే పరిమితం అయ్యాయి. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి పాత ఇళ్లను కూల్చివేశారు. కానీ పనులను అర్ధాంతరంగా వదిలేసారు. దీంతో గ్రామస్తులకు ఇబ్బందులు తప్ప లేదు. క్షేత్రస్థాయిలో గ్రామస్తులు తలదాచుకునేందుకు కూడా ఇబ్బంది పడ్డారు.
ప్రచార ఆర్పాటాల కోసం దత్తత డ్రామాలు ఆడారే తప్ప.. ఆ ఊరి రూపురేఖలు మార్చడంలో నాటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కేవలం అప్పట్లో దత్తత గ్రామం గా ఉన్న వాసాల మర్రి కి సీఎం కాన్వాయ్ సులువుగా వచ్చేందుకు కేవలం రహదారులు వేసి చేతులు దులుపుకున్నారు.
-
మళ్లీ జీవం పోసే ప్రయత్నం..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కెసిఆర్ చేసిన చారిత్రాత్మక తప్పిదం పై సీఎం రేవంత్ ఫుల్ ఫోకస్ పెట్టారు. వాసాల మర్రి కి మళ్లీ జీవం పోసే ప్రయత్నం చేశారు. ఇందిరమ్మ పథకం కింద ఏకంగా 143 ఇళ్లను మంజూరు చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా.. ఇల్ల నిర్మాణాలు శరవేగంగా జరుపుతున్నారు. లబ్ధిదారులకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు.
-
అభివృద్ధి ప్రణాళిక..
అయితే ఆ గ్రామంలో కేవలం గృహ నిర్మాణం మాత్రమే కాదు. పాఠశాల భవనాలు, గ్రామపంచాయతీ వసతులు, రహదారుల పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను కూడా జిల్లా అధికారులు వేగవంతం చేశారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యటించనున్నారు ఆ గ్రామంలో. గత పాలకులు అటకెక్కించిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పరుగులు తీస్తోంది.
దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రచారాల కోసం ఊళ్లను దత్తత తీసుకుని వదిలేసే సంస్కృతికి స్వస్తి పలికి.. వాసాల మర్రిని ఒక ప్రత్యేక అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దాలని రేవంత్ సర్కార్ నిర్ణయించడం మాత్రం గొప్ప విషయమే. ఈ విషయంలో కెసిఆర్ ను ఇరకాటంలో పెట్టేందుకు రేవంత్ వ్యూహరచన చేశారు. అందులో సక్సెస్ అయ్యారు.