-
మూడు కార్పొరేషన్ లే టార్గెట్
-
వరంగల్లో క్లీన్ స్వీప్ చేయాలని వ్యూహం
-
అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలే అసలు లక్ష్యం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: భారతీయ జనతా పార్టీ పక్క వ్యూహంతో ముందుకు సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రణాళికతో ఉంది. అందులో భాగంగా గ్రేటర్ ఎన్నికలను సెమీఫైనల్స్ గా భావిస్తోంది. గ్రేటర్ లో జరగాల్సిన మూడు కార్పొరేషన్ల ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూడు ప్రధాన కార్పోరేషన్లతో పాటు నార్త్ తెలంగాణకు గుండెకాయ లాంటి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ నాలుగు కార్పొరేషన్లను సాధించి.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తో పాటు సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది కాషాయ పార్టీ.
-
క్యూ కడుతున్న నేతలు..
బెంగాల్ విజయం తర్వాత తమ తదుపరి టార్గెట్ తెలంగాణ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకే అగ్రనేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పదివేల కోట్ల అభివృద్ధి పనులకు హైదరాబాదులో శ్రీకారం చుట్టారు కూడా. ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించారు.
గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల పరిధిలో బూత్ ప్రెసిడెంట్ ల తో, రాష్ట్ర కార్యవర్గం ప్రతినిధులతో కీలక భేటీలు నిర్వహించారు. పార్టీ అగ్ర నాయకులను కలుసుకొని ఇక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. ముఖ్యంగా నేతల మధ్య సమన్వయ లోపాన్ని గుర్తించారు.
-
బ్లూ ప్రింట్ ఖరారు..
గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది బిజెపి. అందుకు అవసరం అయిన బ్లూ ప్రింట్ ను ఖరారు చేసింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో.. వరంగల్ నగర పరిధిలో బిజెపి భారీ ఓటు షేర్ సాధించింది. కొన్ని సీట్లను సైతం సొంతం చేసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కేవలం సోషల్ మీడియా ప్రచారాలకే పరిమితం కాకుండా.. ప్రతి డివిజన్లోనూ బలమైన ఆర్థిక, అంగ బలం ఉన్న అభ్యర్థులను గుర్తించి వారికి రూట్ మ్యాప్ ఇవ్వాలని.. ఎన్నికల ఖర్చులకు వెనకాడకుండా వనరులను ముందే సమకూర్చాలని బిజెపి హై కమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
-
అభ్యర్థుల ఖరారు పై దృష్టి..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్ల తో పాటు వరంగల్ కార్పొరేషన్ లో అభ్యర్థుల ఖరారు పై బిజెపి దృష్టి పెట్టింది. ఒకవైపు సిట్టింగ్ కార్పొరేటర్ల పనితీరు.. ఇంకోవైపు ఆశావహులకు సంబంధించిన పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేసింది. సర్వేలు నిర్వహించి నేతల బలాబలాలను గుర్తిస్తుంది.
ఈ సర్వే నివేదికల ఆధారంగానే టిక్కెట్లు ఇచ్చేందుకు నిర్ణయించింది. ముఖ్యంగా వరంగల్ కార్పొరేషన్ పరిధిలో కాషాయ జెండా ఎగురవేయాలన్న కృత నిశ్చయంతో ఉంది. అక్కడ భారత రాష్ట్ర సమితి ఓటు బ్యాంకు క్రమంగా పడిపోతోంది.
మరోవైపు కాంగ్రెస్ అంతర్గత విభేదాలు తమకు కలిసి వస్తాయని కమలనాధులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలోని సైబరాబాద్, మల్కాజ్గిరి ఐటి, అర్బన్ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రచార అస్త్రాలుగా మార్చుకుంది.
-
ఆ రెండు పార్టీలపై అలా..
ఒకవైపు భారత రాష్ట్ర సమితి ద్వితీయ శ్రేణి క్యాడర్ను ఆకర్షిస్తూనే.. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ మైనస్లపై దృష్టి పెట్టింది బిజెపి. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీని హైలెట్ చేయాలని చూస్తోంది. హిందుత్వ ఓటర్లను ఏకతాటిపైకి తెచ్చి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది.
మరో రెండు మూడు నెలల్లో గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపిక నుంచి పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ వరకు అంతా ఒక పద్ధతి ప్రకారం వెళ్లాలని చూస్తోంది కమల దళం. సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావించి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరి ఈ పోరాటంలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.