క్రైం మిర్రర్ : హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. కళాశాలలో ఎదురైన మానసిక వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఈ నిర్ణయం తీసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మణికొండ శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన శ్రేయ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. మొదటి సంవత్సరం పరీక్షల సమయంలో పొరపాటున మొబైల్ ఫోన్‌ను పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లడంతో కళాశాల అధికారులు ఆమెను పరీక్ష నుంచి డీబార్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆ ఘటన అనంతరం రెండో సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి కొందరు అధ్యాపకులు తరచూ ఆమెను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని నెలలుగా అవమానకర వ్యాఖ్యలు, మానసిక ఒత్తిడితో శ్రేయ తీవ్ర ఆందోళనకు గురైందని వారు పేర్కొన్నారు. ఆత్మహత్యకు ముందు శ్రేయ ఓ లేఖ రాసినట్లు పోలీసులు గుర్తించారు. అందులో తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పడంతో పాటు, తన మరణం గురించి కళాశాలలో తెలియజేయొద్దని పేర్కొన్నట్లు సమాచారం. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నారు. తమ కుమార్తె మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఘటనపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. సూసైడ్ నోట్, ఇతర ఆధారాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
also read : తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరగాలి: కవిత