క్రైం మిర్రర్ : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒక్కసారిగా సంభవించిన పేలుడుతో కర్మాగారం మొత్తం మంటల్లో చిక్కుకోగా, పలువురు కార్మికులు శిథిలాల కింద ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం అనంతరం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.
అధికారుల వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌లోని రామోల్–గట్రాడ్ రోడ్డులో ఉన్న ఓ బాణసంచా కర్మాగారంలో ఈ పేలుడు సంభవించింది. ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని వస్త్రాల్ ప్రాంతంలో ఉన్న ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) శిబిరం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక బృందాలు వచ్చేలోపే సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని శిథిలాల నుంచి బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు.
తీవ్రంగా గాయపడిన పలువురిని ఎల్జీ ఆస్పత్రికి, మరికొందరిని అసర్వా సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం ఐదు అగ్నిమాపక వాహనాలతో చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రాథమిక విచారణలో ఈ బాణసంచా కర్మాగారం అవసరమైన అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. పేలుడు కారణంగా భారీ ఆస్తి నష్టం కూడా జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పేలుడు శబ్దం దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని, ఒక్కసారిగా భూమి కంపించినట్లుగా అనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
also read : ముజఫర్‌నగర్‌లో సంచలనం.. మామపై కోడలి తిరుగుబాటు