-
కెసిఆర్ ప్రాజెక్టుకు సానుకూల ప్రకటన
-
ఇరకాటంలో భారతీయ జనతా పార్టీ
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ యూటర్న్ తీసుకున్నారా? ఆయన తిరిగి భారత రాష్ట్ర సమితిలో చేరుతారా? అందుకే కేసిఆర్ కు సానుకూల ప్రకటనలు చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాలేశ్వరం ప్రాజెక్టు పై వివాదం నడుస్తున్న వేళ.. ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బిజెపిలో అంతర్గత విభేదాలు ఉన్నట్లు ప్రచారం మొదలైంది.
-
ఆ రెండు పార్టీల మధ్య ఫైట్..
కాలేశ్వరం ప్రాజెక్టు పై అధికార కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ అన్నట్టు ఉంది పరిస్థితి. కాలేశ్వరం నుంచి తక్షణమే నీటిని ఎత్తిపోయాలని.. ఒక్కచోట బ్యారేజీ కుంగినంత మాత్రాన.. మొత్తం ప్రాజెక్టు నాశనమైందని ప్రచారం చేయడం సరి కాదంటూ భారత రాష్ట్ర సమితి వినిపిస్తున్న వాదనకు వంత పాడారు ఈటెల రాజేందర్.
దీంతో కాషాయ పార్టీలో సైతం ఆందోళన మొదలైంది. కెసిఆర్ మానస పుత్రికగా ఈ మెగా ప్రాజెక్టు పై రాజేందర్ హఠాత్తుగా సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించడం వెనుక రాజకీయం దాగి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఈటెల రాజేందర్ అభిప్రాయంతో బిజెపి రాష్ట్ర అగ్ర నాయకత్వం ఏకీభవించడం లేదు..
ఈటెల రాజేందర్ మాట్లాడిన కొద్దిసేపటికి బిజెపి సీనియర్ నేత రామచంద్రరావు కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో కెసిఆర్ వ్యవహరించిన తీరును తప్పుపడుతూ తీవ్రస్థాయిలో ధ్వజం ఎత్తారు. కాలేశ్వరం ప్రాజెక్టు అనేది తెలంగాణ ప్రజల పాలిట ఒక డ్రామేశ్వరం అని.. కెసిఆర్ కుటుంబం దోచుకోవడానికి కట్టిన ఏటీఎం లాంటిదని ఆయన కొట్టి పారేశారు.
నిపుణుల నివేదికలను పక్కనపెట్టి.. కేవలం బిఆర్ ఎస్ మైలేజ్ కోసం మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేయడం మూర్ఖత్వం అవుతుందని స్పష్టం చేశారు. అయితే ఒకే అంశంపై ఎంపీ ఈటెల అలా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అలా మాట్లాడటంతో కమలతలంలో సమన్వయ లోపం బయటపడింది.
-
టిఆర్ఎస్ లోనే సుదీర్ఘకాలం
ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితిలో సుదీర్ఘకాలం పనిచేశారు. కెసిఆర్ వెన్నంటి నడిచిన నాయకుల్లో మొదటి వారు. కెసిఆర్ సైతం రాజేందర్ కు చాలా రకాల అవకాశాలు కల్పించారు. కెసిఆర్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా కూడా పనిచేశారు రాజేందర్. ఒకప్పటి తన బాస్ డిజైన్ చేసిన ప్రాజెక్టును పూర్తిగా తప్పు పట్టడానికి ఆయన అంతరాత్మ అంగీకరించలేదని చర్చ నడుస్తోంది.
పైగా ప్రాజెక్టు నిర్మాణంలో ఆయన పాలుపంచుకున్నారు. ఇప్పటికే బీజేపీతో బిఆర్ఎస్ పొత్తు ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దానిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది బిజెపి. కానీ ఇప్పుడు కెసిఆర్ కట్టిన ప్రాజెక్టుకు మద్దతుగా ఈటెల రాజేందర్ మాట్లాడడం మాత్రం పార్టీని డిఫెన్స్ లో పడేసింది. ఈటెల రాజేందర్ వ్యవహార శైలి పై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వర్గాలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల పరిణామాలు చూస్తే బిజెపిలో ఈటెల రాజేందర్ ఇబ్బందికర పరిస్థితులను నొప్పిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. కాలేశ్వరంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి కేసీఆర్ను జైలుకు పంపాలని ఒకవైపు మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు డిమాండ్ చేస్తున్నారు.
ఈటెల రాజేందర్ మాత్రం ప్రాజెక్టును సమర్థించడం ఆయనకు మైనస్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే కేంద్ర మంత్రివర్గం రేసులో ఉన్నారు ఆయన. లేనిపోని వివాదాన్ని పార్టీపై నెట్టేందుకు అవకాశం కలిగింది. అందుకే ఈటెల రాజేందర్ తీరుపై భారతీయ జనతా పార్టీలో విమర్శలు వినిపిస్తున్నాయి.