క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- తెలంగాణలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నా, రైతులు కంటతడి పెడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. గోదావరి జలాలను లిఫ్ట్ చేయడంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు ఆయన బుధవారం సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.రాష్ట్రంలో వర్షాలు ముఖం చాటేయడంతో అన్నదాతలు అల్లాడిపోతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. “అన్నదాత అల్లాడుతుంటే ప్రభుత్వానికి పాపం అనిపించడం లేదా?” అని ఆయన ప్రశ్నించారు. గోదావరి నీరు వృథాగా సముద్రం పాలు అవుతున్నప్పటికీ, ఆ నీటిని సాగు అవసరాల కోసం ఎత్తిపోయడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని దుయ్యబట్టారు. సాగునీటి కోసం కన్నెపల్లి (మేడిగడ్డ) పంప్‌హౌస్ మోటార్లను నడపాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని, కనీస స్పృహ లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న రాజకీయ కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని శిక్షించవద్దని కేటీఆర్ హితవు పలికారు. “మీకు రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమా?” అంటూ ఘాటుగా ప్రశ్నించారు. కరువు వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, ఎక్కడా చుక్క నీరు లేకపోయినా తెలంగాణ రైతాంగాన్ని కాపాడేందుకు “కాళేశ్వరం ప్రాజెక్టు” ఒక్కటి చాలని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండివైఖరి వీడి, తక్షణమే కన్నెపల్లి మోటార్లను రన్ చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Chiru158 మూవీ హైదరాబాద్‌లో భారీ యాక్షన్ షెడ్యూల్…!
ప్రభాస్‌ను మెప్పించిన దురంధర్ దర్శకుడు…!