•ఆరాటపడుతున్న సీఎం రేవంత్
•కేంద్రానికి వరుసగా లేఖలు
•నెలల తరబడి సమయం పట్టే అవకాశం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :- హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు పై సీఎం రేవంత్ దూకుడుగా వ్యవహరించారు. వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని చూస్తున్నారు. కానీ అది అంత సులువు కాదు. హైదరాబాద్ మెట్రో టికోవర్, పేజ్ 2 ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని స్ట్రాంగ్ గా నిర్ణయించుకున్నారు రేవంత్. ఇప్పటికే ఎస్బిఐ క్యాప్స్ ను రంగంలోకి దింపాలని నిర్ణయించారు. ఇది జరిగి రెండు వారాలు దాటిపోతుంది. కానీ కేంద్రం నుంచి ఎటువంటి కదలిక లేదు. దీంతో సీఎం రేవంత్ మరోసారి స్పందిస్తూ కేంద్రానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రులు మనోహర్లాల్ కట్టర్, కిషన్ రెడ్డిలకు లేఖలు రాశారు. దీంతో మరోసారి హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ప్రధాన చర్చకు దారి తీసింది.
రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా..
మెట్రో పేజ్ 1 ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఫేజ్ 2 పనులను వేగవంతం చేయడానికి అవసరమైన ఆర్థిక ముసాయిదా, విలువ నిర్ధారణ, రి ఫైనాన్స్సింగ్ ప్రక్రియల కోసం ఎస్బిఐ క్యాప్స్ ను వెంటనే నియమించాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆలస్యం అయ్యే కొద్ది ప్రాజెక్టు వ్యయం పెరగడమే కాకుండా, కార్యాచరణలు అనిశ్చితి ఏర్పడుతుందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికీ టేకోవర్ కోసం చేసిన లోన్ ప్రయత్నాలు పూర్తయ్యాయి. కానీ చివరి నిమిషంలో కేంద్రం అడ్డు పుల్ల వేసి కొత్త ప్రక్రియను ప్రతిపాదించింది. తప్పనిసరి పరిస్థితుల్లో దానికి రేవంత్ కూడా అంగీకరించారు. కానీ అది కూడా ఆలస్యం అవుతోంది.
ఫైళ్ల క్లియరెన్స్..
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ గడ్డి పట్టుదలతోనే ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సాగే అధికారిక వ్యవహారాలు, ఫైళ్ళ కదలికలు ఎంత ఆలస్యంగా సాగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వ వ్యవస్థల్లో ఏ చిన్న పెద్ద నిర్ణయం జరగాలన్న అది ప్రాసెస్ ప్రకారమే జరగాల్సి ఉంటుంది. ముఖ్యంగా మెట్రో లాంటి వేల కోట్ల రూపాయల భారీ అంతర్జాతీయ మౌలిక వసతుల ప్రాజెక్టును.. ఒక ప్రైవేటు భాగస్వామ్యం నుంచి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవడం అనేది అంత సులువు కాదు. లేఖలు రాసినంత ఈజీ కాదు. దాని వెనుక అనేక లీగల్, టెక్నికల్, ఫైనాన్షియల్ క్లియరెన్స్ లు చేయాల్సి ఉంటుంది.
అధికారిక నిబంధనలు..
కచ్చితంగా ఇది నెలల తరబడి పట్టే ప్రక్రియ గా అర్థం అవుతోంది. కేంద్ర నిబంధనల ప్రకారం.. ఎస్బిఐ క్యాప్స్ లాంటి థర్డ్ పార్టీ సంస్థ వ్యాల్యూషన్ నివేదిక ఇవ్వడానికి.. ఆ నివేదికలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, ఆర్థిక శాఖలు క్షుణ్ణంగా పరిశీలించడానికి కచ్చితంగా నెలల తరబడి సమయం పట్టడం ఖాయం. ఇరు ప్రభుత్వాల మధ్య అంగీకారం కుదిరిన, ఈక్విటీ షేరింగ్, అప్పుల సర్దుబాటు వంటి వ్యూహాత్మకాంశాలపై పదుల సంఖ్యలో ఉన్నత స్థాయి కమిటీల సమావేశాలు జరగాల్సి ఉంది.. రేవంత్ ఎన్ని రకాల ఒత్తిడి తెచ్చినా.. కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం తన సొంత నిబంధనలు, సుదీర్ఘ అధికారిక ప్రక్రియల ప్రకారమే అడుగులు వేస్తుంది తప్ప.. వేగం పెంచడం అంత సులువు కాదు. మెట్రో రెండో దశ పట్టాలెక్కడం అంత ఈజీ కూడా కాదు.