Maharashtra Floods: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. థానే, ముంబై, పుణెతో పాటు అనేక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈ వర్షాల కారణంగా సుమారు 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడగా, మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. దీంతో ప్రజలు బయటకు రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు.
థానే జిల్లాలోని భివండి ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రోడ్లపై మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు నిలిచిపోవడంతో ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ రోడ్డు ఉందో గుర్తించడం కష్టంగా మారింది. ఈ కారణంగా వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. స్థానికుల కష్టాలను చూసిన షాదాబ్ మోమిన్ అనే యువకుడు వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం అతను స్పైడర్ మ్యాన్ వేషం ధరించి రోడ్డుపైకి వచ్చాడు. ‘ఫ్రెండ్లీ స్పైడర్ మ్యాన్’గా మారిన షాదాబ్, నీటిలో దాగి ఉన్న గుంతలను వాహనదారులకు చూపిస్తూ సురక్షితంగా వెళ్లేలా సహాయం చేస్తున్నాడు. గుంతల్లో చిక్కుకున్న బైక్‌లు, ఆటోలు, ఇతర వాహనాలను బయటకు తీసేందుకు కూడా తన వంతు సహాయం అందిస్తున్నాడు. ఎవరూ ప్రమాదానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ గంటల తరబడి సేవ చేస్తున్నాడు.
అతని సేవలు చూసి చిన్నారులు కూడా ఆనందపడుతున్నారు. స్పైడర్ మ్యాన్‌ను నిజమైన హీరోగా భావించే పిల్లలు అతని దగ్గరకు పరుగెత్తుకుంటూ వస్తున్నారు. వారిని తన భుజాలపై ఎక్కించుకుని రోడ్డు దాటించడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ దృశ్యాలు చూసిన స్థానికులు షాదాబ్‌ను ప్రేమగా “భివండి స్పైడర్ మ్యాన్” అని పిలుస్తున్నారు. అతను చేసే సరదా స్టంట్లు, ప్రజలకు అందిస్తున్న సహాయం అక్కడి వారిలో ధైర్యాన్ని నింపుతున్నాయి. కొంతమంది యువకులు ఈ ఘటనలను వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వేగంగా వైరల్ అయ్యాయి. నెటిజన్లు కూడా షాదాబ్ మోమిన్ సేవలను ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇలాంటి యువకులు ముందుకు వచ్చి సమాజానికి అండగా నిలవడం ఎంతో గొప్ప విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.