Tejo Mahalaya Petition: తాజ్ మహల్‌కు సంబంధించిన వివాదంలో అలహాబాద్ హైకోర్టు కీలక పరిణామం చోటుచేసుకుంది. ‘తేజో మహాలయ’ అంశంపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు కేంద్ర ప్రభుత్వం, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నాలుగో ప్రతివాదిగా ఉన్న పంకజ్ కుమార్ వర్మకు కూడా నోటీసులు పంపించింది. సంబంధిత అంశంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
పిటిషనర్ల వాదన ప్రకారం, ప్రస్తుతం తాజ్ మహల్‌గా ఉన్న ప్రదేశంలో ఒకప్పుడు ‘అగ్రేశ్వర్ మహాదేవ్ నాగనాథేశ్వర్ తేజో మహాలయ’ అనే శివాలయం ఉండేదని పేర్కొన్నారు. ఈ వాదనపై పూర్తి స్థాయిలో నిజానిజాలు తెలుసుకోవాలంటే తాజ్ మహల్ ప్రాంగణంలో సర్వే నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని వారు కోర్టును కోరారు. అలాగే అవసరమైన ఫొటోగ్రఫీ, పరిశీలనకు కూడా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇంతకుముందు ఇదే అంశంపై ఆగ్రా జిల్లా కోర్టును ఆశ్రయించగా, సర్వేకు అనుమతి ఇవ్వాలన్న అభ్యర్థనను ఆ కోర్టు తిరస్కరించింది. దీంతో ఆ తీర్పును సవాల్ చేస్తూ న్యాయవాది హరి శంకర్ జైన్ అలహాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ ప్రారంభమైంది.
ఈ కేసును విచారించిన జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, ఏఎస్ఐ తమ వాదనలు, వివరాలను కౌంటర్ అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది. ఆ నివేదికలు వచ్చిన తర్వాతే తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం, ఏఎస్ఐ సమర్పించే వివరణలను పరిశీలించిన అనంతరం తాజ్ మహల్ ప్రాంగణంలో సర్వే నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలా లేదా అనే అంశంపై అలహాబాద్ హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం కోర్టు ఎలాంటి తుది తీర్పు ఇవ్వలేదు. ఈ వ్యవహారంలో అన్ని పక్షాల వాదనలు పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.