క్రైమ్ మిర్రర్, జాతీయం:- దేశంలోని కోట్లాది మంది ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) నిల్వలపై 8.25 శాతం వడ్డీ రేటును అధికారికంగా ఖరారు చేస్తూ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు లభ్ది చేకూరుతుంది. ఈ మేరకు వడ్డీ మొత్తాన్ని తక్షణమే వినియోగదారుల ఖాతాల్లోకి జమ చేయాలంటూ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని క్షేత్రస్థాయి ప్రాంతీయ కార్యాలయాలను ఈపీఎఫ్‌వో ఆదేశించింది. తాజాగా ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీ రేటుకు సంబంధించిన నిర్ణయానికి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ దీనికి ఆమోదం తెలపడంతో ఈపీఎఫ్‌వో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈపీఎఫ్ పథకం-1952 పేరా 60(1) ప్రకారం 2-25-26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీని ప్రతి సభ్యుని ఖాతాలో జమ చేయడానికి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ అనుమతి లభించిందని ఈపీఎఫ్‌వో తన తాజా సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ తుది అనుమతి లభించిన నేపథ్యంలో సభ్యుల ఖాతాల్లోకి సకాలంలో వడ్డీని బదిలా చేసేందుకు వీలుగా సంబంధిత విభాగాలను తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశిస్తున్నామని ఈపీఎఫ్‌వో సర్క్యులర్‌లో పేర్కొంది.
మూడో ఏడాది ఉద్యోగులకు మేలు..
వరుసగా మూడో ఏడాది కూడా 8.25 శాతం వడ్డీని చెల్లించేలా నిర్ణయం తీసుకోవడం ద్వారా వేలాది మంది ఉద్యోగులకు మేలు చేకూరినట్టు అయింది. ఈ ఏడాది మార్చిలోనే ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఈ 8.25 శాతం వడ్డీ రేటును ప్రతిపాదించింది. అనంతరం జూన్ నెలలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఈపీఎఫ్‌వో వరుసగా మూడో ఏడాది కూడా 8.25 శాతం గరిష్ట వడ్డీ రేటును కొనసాగించడం విశేషం. మార్కెట్ ఒడుదుడుకులు ఉన్నప్పటికీ ఉద్యోగుల పదవీ విరమణ నిధికి భద్రతతోపాటు ఉత్తమ రాబడిని అందించే ఉద్ధేశంతో కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల ఉద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ రేటు అధికంగా ఇచ్చేలా నిర్ణయం తీసుకోవడం పట్ల దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో ఈపీఎఫ్ ఖాతాల్లోని డబ్బుకు ఎక్కువ వడ్డీ ఉద్యోగులకు లభించనుంది.