ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. కుటుంబ ఆస్తి వివాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో భర్త తన భార్యను కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన కలకలం సృష్టించింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రదీప్ చౌహాన్, నిషా చౌహాన్ దంపతుల మధ్య గత కొంతకాలంగా ఆస్తి విషయంలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ వివాదం తరచూ వాగ్వాదాలకు దారితీస్తూ ఉండగా, శుక్రవారం ఉదయం అది హింసాత్మకంగా మారింది.
45 ఏళ్ల నిషా చౌహాన్ సోషల్ మీడియా వేదికల్లో చురుకుగా ఉండే ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందారు. ఆమెకు మంచి ఫాలోయింగ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె హత్య వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది.
వివాదం తారాస్థాయికి చేరుకున్న సమయంలో ప్రదీప్ కత్తితో నిషాపై దాడి చేశాడు. ఈ సమయంలో వారి 17 ఏళ్ల కుమారుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, అతనికి కూడా గాయాలు అయ్యాయి. తల్లి ప్రాణాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. భార్యను హత్య చేసిన అనంతరం ప్రదీప్ తనపై తాను దాడి చేసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుమారుడి పరిస్థితి ప్రమాదకరం కాదని వైద్యులు పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనాస్థలంలో ఆధారాలను సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో కుటుంబ ఆస్తి, ఆర్థిక అంశాలపై ఉన్న విభేదాలే ఈ దారుణానికి కారణమని అనుమానిస్తున్నారు. పొరుగు వారిని, కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు.
also read: ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే బాలిక మృతి..! పులివెందులలో ఉద్రిక్తత