క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. గ్రామీణ క్రీడా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. జూన్ 4న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం 2026లో దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాగా, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సాంకేతిక నిపుణులకు చిరంజీవి, రామ్ చరణ్ చేతుల మీదుగా సన్మానాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ, పెద్ది సినిమా ఇండస్ట్రీకి ఆక్సిజన్‌లాంటి విజయమని అన్నారు. థియేటర్లకు మళ్లీ ప్రేక్షకులను తీసుకురావడంలో ఈ చిత్రం కీలక పాత్ర పోషించిందని తెలిపారు.
చిత్రబృందంలోని ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని ఆయన ప్రశంసించారు. అలాగే దర్శకుడు బుచ్చిబాబు ఇలాంటి కథను భారీ స్టార్‌డమ్ ఉన్న హీరోతో తెరకెక్కించడం గొప్ప విషయమని అన్నారు. రామ్ చరణ్ ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డారని, కొండలు ఎక్కి, దుమ్ములో తిరిగి పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారని చెప్పారు. సినిమాలోని ఒక పోస్టర్ తనకు హనుమంతుడిని గుర్తు చేసిందని, ఆ స్థాయిలో చరణ్ నటన ఆకట్టుకుందని పేర్కొన్నారు. తండ్రికి మించిన తనయుడు అన్నట్టుగా రామ్ చరణ్ పెద్ది పాత్రలో అద్భుతంగా నటించారని, ఆయనకు మరిన్ని విజయాలు రావాలని అనిల్ రావిపూడి ఆకాంక్షించారు. తొలి సినిమాతోనే నిర్మాత సతీష్ భారీ విజయాన్ని అందుకోవడం కూడా ఆనందకరమని ఆయన అన్నారు.