ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే ప్రతి ఒక్కరికీ మొదట గుర్తొచ్చే పేరు పాకాల. పచ్చని అడవులు, విస్తారమైన సరస్సు, నిశ్శబ్దాన్ని అలరించే పక్షుల కిలకిలారావాలతో ఇక్కడి వాతావరణం ఒక మధురానుభూతిని అందిస్తుంది. ఇటీవల ఆధునిక సదుపాయాలు జోడించడంతో పాకాల పర్యాటక కేంద్రంగా మరింత ఆకర్షణీయంగా మారింది.
హైదరాబాద్ నుంచి సుమారు 205 కి.మీ. దూరంలో ఉన్న పాకాలకు రైలు, రోడ్డు మార్గాల్లో సులభంగా చేరుకోవచ్చు. రైలులో వచ్చే వారు వరంగల్ వరకు వచ్చి అక్కడి నుంచి బస్సు లేదా ప్రైవేట్ వాహనంలో పాకాలకు చేరుకోవచ్చు. వరంగల్ నుంచి ఇది సుమారు 58 కి.మీ. దూరంలో ఉంటుంది.
పాకాల బయోడైవర్సిటీ పార్క్ వద్దే పర్యటన ప్రారంభమవుతుంది. ఇక్కడ ప్రవేశానికి పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.30 చెల్లించాలి. ప్లాస్టిక్ వస్తువులకు అనుమతి ఉండదు. కట్టపైకి ప్రైవేట్ వాహనాలు వెళ్లవు. పర్యాటకులు బ్యాటరీ వాహనాల్లో ఒక్కరికి రూ.10 చెల్లించి వెళ్లాలి. ఆటో తీసుకుంటే అరగంటకు రూ.400 చెల్లించాలి.
సరస్సులో బోటింగ్ ప్రధాన ఆకర్షణ. స్పీడ్ బోటింగ్‌కు రూ.400 కాగా, సాధారణ పెద్ద బోటులో ప్రయాణం చేయాలంటే రూ.50 చెల్లించాలి. కట్ట దిగువన చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పార్క్‌లో వివిధ ఆటలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో చిన్నారి రూ.50 చెల్లించి 20 నిమిషాల పాటు ఆడుకోవచ్చు.
అదే ప్రాంగణంలో ఫెడల్ బోటింగ్ 10 నిమిషాలకు రూ.50, చార్జింగ్ బాల్ అనుభవం కోసం రూ.100 చెల్లించాలి. బటర్‌ఫ్లై గార్డెన్‌లోకి ఉచితంగా ప్రవేశించి రంగురంగుల సీతాకోకచిలుకలను ఆస్వాదించవచ్చు. ప్రకృతి ప్రేమికులకు సఫారీ టూర్ ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. రూ.250 చెల్లించి 9 కి.మీ. వరకు అడవిలో ప్రయాణం చేయవచ్చు. వాచ్ టవర్ల వద్ద ఆగి పక్షులు, జంతువులను గమనించే అవకాశం ఉంటుంది. గైడ్ సహాయంతో అడవి జీవ వైవిధ్యంపై అవగాహన పొందవచ్చు.
సైక్లింగ్‌ను ఇష్టపడేవారికి గంటకు రూ.20కి సైకిల్ సౌకర్యం ఉంది. కుటుంబ వేడుకలు, చిన్న పార్టీలు నిర్వహించేందుకు గణపతిదేవ వన మండపం కూడా అందుబాటులో ఉంది. 20 మంది వరకు రూ.5,000, 50 మందికి రూ.10,000, 150 మందికి రూ.15,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
ఫోటోషూట్ కోసం రూ.600, వీడియో షూట్‌కు రూ.2,500, డ్రోన్ వినియోగానికి రూ.3,000 చెల్లించాలి. ప్రకృతి మధ్య ప్రత్యేక క్షణాలను బంధించుకోవడానికి ఇది మంచి అవకాశం.
పాకాలలో నైట్ క్యాంపింగ్ కూడా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఒక్కరికి రూ.1999 చెల్లించి ఈ అనుభవాన్ని పొందవచ్చు. సాయంత్రం నుంచి ఉదయం వరకు క్యాంప్ ఫైర్, టెంటు బస, ట్రెక్కింగ్, నేచర్ వాక్, అల్పాహారం, బోటింగ్ వంటి కార్యక్రమాలు ఉంటాయి. ముందస్తుగా బుకింగ్ తప్పనిసరి. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంత వాతావరణం ఇవన్నీ కలిసిన పాకాల పర్యటన జీవితాంతం గుర్తుండే అనుభూతిని మిగుల్చుతుంది.
also read: 9 ఏళ్ల ప్రేమకు ముగింపు… పెళ్లితో ఒకటైన ఫైమా- ప్రవీణ్ నాయక్ జంట