-
మేనమామగా చేయాల్సిన కార్యక్రమాలకు సైతం దూరం
-
ఆవేదనలో రాజశేఖర్ రెడ్డి అభిమానులు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కానీ ఇంతటి వేడుకలకు బాధ్యతగా వెళ్లాల్సిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం గైర్హాజరయ్యారు. ఆయన కేవలం షర్మిల సోదరుడు మాత్రమే కాదు. వధువు అంజలి రెడ్డికి మేనమామ. భారతీయ వివాహ వ్యవస్థలో మేనమామ పాత్ర కీలకం. చెల్లెలిపై ఉన్న కోపంతో సొంత మేనకోడలి జీవితంలో అత్యంత కీలకమైన వేడుకలకు జగన్ గైర్హాజరు కావడం ఆయన కుటుంబ వ్యవహారం మాత్రమే కాదు. ఆయన నాయకత్వ లక్షణాలపై పడుతున్న పెద్ద మచ్చ కూడా. పెద్దల మధ్య ఎంతటి ఆర్థిక, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. ఇంటి ఆడపడుచు పిల్లల శుభకార్యాలకు వచ్చేసరికి పాత పగలను పక్కన పెట్టడం తెలుగు సంస్కృతిలో భాగం. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై వధూవరులను ఆశీర్వదించిన చోట.. రక్త సంబంధీకుడైన మేనమామ జగన్ కనీసం అటువైపు చూడకపోవడం.. ఆయనలో ఉన్న కఠిన వైఖరిని ఎత్తిచూపుతోంది.
పిల్లల విషయంలో తగదు…
షర్మిల తో జగన్మోహన్ రెడ్డికి విభేదాలు ఉన్నాయి. తన రాజకీయ అవకాశాలను షర్మిల గండి కొట్టారు. తన రాజకీయ పతనాన్ని కోరుకున్నారు. అంతవరకు కోపం ఉండవచ్చు. కానీ ఏ పాపం ఎరుగని పిల్లల మీద పడనివ్వకూడదనే కనీస విచక్షణను జగన్మోహన్ రెడ్డి మరిచిపోయారన్న విమర్శలు ఉన్నాయి. హిందూ వివాహ వ్యవస్థలో మేనమామ స్థానానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. సాంప్రదాయ బద్దంగా మేనకోడలి వివాహ వేడుకల్లో మేనమామ చేతులమీదుగా జరిగే ప్రధాన క్రతువులు, ఆశీర్వాదాలు ఎంతో పవిత్రమైనవి. గతంలో తన కుమారుడు రాజారెడ్డి వివాహ సమయంలో షర్మిల స్వయంగా తాడేపల్లి కి వెళ్లి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించినప్పుడు.. ఆయన అరకొరగానే హాజరై మామ అనిపించేసారు. తరువాత పెళ్లికి హాజరు కాలేదు. ఇప్పుడు షర్మిల కుమార్తె నిశ్చితార్థ వేడుకకు కూడా ముఖం చాటేసారు. డిసెంబర్ లో జరగనున్న వివాహ వేడుకలకు హాజరుకాను అంటూ సంకేతాలు ఇచ్చారు.
శుభకార్యాలకు సైతం…
రాజకీయంగా రాష్ట్రంలో అతిపెద్ద కుటుంబం వైయస్సార్ కుటుంబం. కానీ ఆ కుటుంబంలో కనీసం శుభకార్యాలకు కూడా హాజరు కాలేని విధంగా రాజకీయాలు మారిపోయాయి అని అభిమానులు బాధపడుతున్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ఎన్నో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆయనకు కుటుంబం అండగా నిలిచింది. రాజశేఖర్ రెడ్డి మరణం సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ కుటుంబం అండగా నిలిచింది. జగన్మోహన్ రెడ్డి కొత్తగా పార్టీ ఏర్పాటు చేసినప్పుడు, పాదయాత్ర చేసినప్పుడు ఆ ఫ్యామిలీ అహోరాత్రులు శ్రమించింది. ఇక విజయమ్మతో పాటు షర్మిల విషయం చెప్పనవసరం లేదు. అంతలా కష్టపడ్డారు కూడా. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని దూరం చేసుకున్నారు జగన్. ఇప్పుడు వారితో ఉన్న వ్యక్తిగత సంబంధాలను కూడా తెంచుకుంటున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హత్య కేసు పరిణామాల నుంచి మొదలుకుని ఆస్తుల కేసుల వరకు కుటుంబ మొత్తాన్ని వదులుకొని రాజశేఖర్ రెడ్డి అభిమానులకు తీవ్ర ఆవేదనను మిగిల్చుతున్నారు జగన్.
