- సింగరేణి కార్మికుల సాయం తీసుకోవాలని నిర్ణయం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : టిఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రత్యేక వ్యూహంతో అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఆమె టార్గెట్ చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సత్తా చాటాలని చూస్తున్నారు. కానీ అది రాష్ట్రవ్యాప్తంగా కాదు. ఎంపిక చేసుకున్న కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలుపొందాలి అని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఆ అనుభవంతో..
కవితా పూర్వాశ్రమంలో గులాబీ పార్టీలో పని చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా విస్తృతంగా ప్రచారం చేసేవారు. మరోవైపు సింగరేణి కార్మికుల సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా కూడా ఉండేవారు. అందుకే ఆమె కరీంనగర్ తో పాటు నిజామాబాద్ జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ఆమె పోటీకి సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా ఆమె ప్రిపేర్ చేసుకున్నట్లు సమాచారం. బలమైన అభ్యర్థులను బరిలో దించడం ద్వారా సీట్ల పరంగా పరవాలేదనిపించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ పార్టీల మధ్య..
ప్రస్తుతం తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. ఇంకో వైపు గులాబీ పార్టీ సైతం పూర్వ వైభవానికి గట్టిగానే ప్రయత్నిస్తోంది. భారతీయ జనతా పార్టీ సైతం ఎలాగైనా గెలవాలని చూస్తోంది. ఇంకోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీని విస్తరించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో తన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని కవితకు తెలుసు. అందుకే తెలంగాణ జాగృతి బలంగా ఉన్న ప్రాంతాల్లో.. సింగరేణి కార్మికులు ఉన్న ప్రాంతాల్లో పోటీకి ఆమె సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీ నుంచి బలమైన అభ్యర్థులను ప్రయోగించి కనీసం 50 సీట్లపై గురి పెట్టాలన్నది కవిత ఆలోచనగా తెలుస్తోంది. మరి ఆమె అంచనాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
భవిష్యత్ రాజకీయాలకు పునాది..
తెలంగాణలో కనీసం 20 నుంచి 30 అసెంబ్లీ సీట్లు తెచ్చుకున్న తన రాజకీయ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే 2028 ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్నది కవిత ప్లాన్ కాదు. తన పార్టీని గౌరవప్రదమైన సీట్లతో తెలంగాణ సమాజం ముందు ఉంచాలన్నది ఆమె వ్యూహం. తర్వాత క్రమేపి విస్తరించి తెలంగాణలో అధికారంలోకి రావాలన్నది ఆమె ఆలోచన. వాటికి తగ్గట్టు ఆమె వ్యూహాలు రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు.