ఈ ఏడాది మార్కెట్లలో, గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా నేరేడు పండ్లే కనిపిస్తున్నాయి. చెట్ల నుంచి అక్షరాలా పండ్లు కురుస్తున్నాయి. గతంలో తక్కువగా కాసిన చెట్లు కూడా ఈసారి విపరీతంగా పండ్లు కాయిస్తున్నాయి.
ఇది కేవలం యాదృచ్ఛికమా? లేక ప్రకృతి మనకు ఏదైనా సందేశం ఇస్తోందా? ప్రకృతిని చాలా దగ్గరగా గమనించే మన పెద్దలు మాత్రం ఇదో ప్రమాద సంకేతమని చెబుతున్నారు.
వేసవిలో నేరేడు చెట్లు విపరీతంగా పండ్లు రాలిస్తే, ఆ సంవత్సరం కరువు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నమ్మకం. కొందరి దీనిని మూఢనమ్మకంగా చూసినా.. ఆశ్చర్యకరంగా, ఆధునిక వృక్ష శాస్త్రంలో కొన్ని పరిశోధనలు ఈ పరిశీలన వెనుక ఉన్న తర్కాన్ని వివరిస్తున్నాయి.
చాలా వృక్ష జాతులు కొన్ని సంవత్సరాల్లో అసాధారణంగా ఎక్కువ పండ్లు, విత్తనాలు ఉత్పత్తి చేస్తాయి. దీనిని “మాస్టింగ్” అంటారు.ఇది చెట్టు తన జాతి మనుగడ కోసం అనుసరించే సహజ వ్యూహం. భూగర్భ జలాలు తగ్గడం, దీర్ఘకాలిక ఎండలు, ఉష్ణోగ్రతల పెరుగుదల లేదా ఇతర వాతావరణ ఒత్తిళ్లు ఎదురైనప్పుడు, చెట్టు తన జీవన చక్రంలో మార్పులు చేస్తుంది.అలాంటి సమయంలో చెట్టు కొత్త కొమ్మలు, ఆకులు పెంచడంపై కాకుండా పండ్లు, విత్తనాల ఉత్పత్తిపై ఎక్కువ శక్తిని వెచ్చిస్తాయి.
ప్రకృతి భాషలో చెప్పాలంటే.. భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని.. కనీసం తన తరువాతి తరాలు అయినా బతకాలనే సంకేతం ఇందులో ఉంటుందని చెబుతున్నారు.నేరేడు చెట్ల వేర్లు చాలా లోతుగా వెళ్తాయి. పైపొరలో నీరు లేకపోయినా భూగర్భ జలాలను ఉపయోగించగల సామర్థ్యం వీటికి ఉంటుంది. అలాంటి చెట్లకే నీటి ఒత్తిడి కనిపిస్తే, అది భూగర్భ జలాల పరిస్థితిపై ఒక హెచ్చరిక సంకేతంగా భావించవచ్చు.అందుకే మన పెద్దలు నేరేడు చెట్ల ప్రవర్తనను గమనించి వాతావరణం గురించి అంచనాలు వేసేవారు.
ఈ ఏడాది వాతావరణ శాఖ కూడా 12 రాష్ట్రాలపై ఎల్ నినో తీవ్ర ప్రభావం ఉంటుందని ప్రకటించింది. అందులో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో ప్రజలు హడలిపోతున్నారు.ప్రకృతిలో ప్రతి మార్పు వెనుక ఒక కారణం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.అధిక పండ్ల దిగుబడి అంటే తప్పనిసరిగా కరువు వస్తుందనే కాదు.. వర్షపాతం, గత సంవత్సరం వాతావరణ పరిస్థితులు, చెట్ల సహజ జీవచక్రం వంటి అనేక అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయి.
ప్రకృతి మనకంటే ముందుగానే మార్పులను గుర్తిస్తుంది. మన పెద్దలు ఆ సంకేతాలను గమనించి తమ అనుభవాన్ని తరతరాలకు అందించారు.ఈ ఏడాది నేరేడు పండ్ల సమృద్ధిని ఆనందిద్దాం. కానీ అదే సమయంలో నీటిని వృథా చేయకుండా వాడుదాం.. వర్షపు నీటిని సంరక్షిద్దాం.. భూగర్భ జలాలను కాపాడుదాం..ప్రకృతిని గౌరవిద్దాం.. ప్రకృతిని గౌరవించిన సమాజమే భవిష్యత్తును గెలుస్తుంది.