-
దామర భీమనపల్లిపై ఇంతటి కఠినమా…?
-
ఫిర్యాదులపై స్పందన ఎక్కడ..? ప్రజల ఆరోగ్యానికి హామీ ఎవరిది..?
-
కోమటిరెడ్డి ఎంట్రీతోనే సమస్య పరిష్కారం..
క్రైమ్ మిర్రర్ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): నల్లగొండ జిల్లా దామెర భీమనపల్లి గ్రామంలో అక్రమ కోళ్ల ఫారాల వ్యవహారం, రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతోంది. అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టారని, గ్రామానికి సమీపంలో భారీ కోళ్ల ఫారాలు ఏర్పాటు చేయడం వల్ల, ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశంపై గ్రామస్తులు పలుమార్లు సంబంధిత శాఖల అధికారులకు, జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించలేదని వారు ఆరోపిస్తున్నారు. దీనితో “ప్రజల సమస్యల కంటే ప్రభావశీలుల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారా?” అనే ప్రశ్నలు గ్రామంలో వినిపిస్తున్నాయి.
గ్రామస్తుల వాదన ప్రకారం.. శాఖలకు అనేకసార్లు ఫిర్యాదులు చేసినా, ఫలితం లేకపోయిందని ప్రజలు చెబుతున్నారు. ప్రతి శాఖ బాధ్యతను మరో శాఖపైకి నెట్టేస్తోందని, చివరకు సమస్య మాత్రం అలాగే మిగిలిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-
ప్రజల ఆరోగ్యాలపై భయం.. రోజు రోజుకి పెరుగుతున్న దుర్వాసన
కోళ్ల ఫారాల నుంచి వచ్చే దుర్వాసన, ఈగలు, వ్యర్థాల వల్ల గ్రామంలో చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు అంటున్నారు. శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు, ఇతర ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. దీనిపై వైద్యశాఖ, కాలుష్య నియంత్రణ మండలి సమగ్ర పరిశీలన చేపట్టిందా లేదా, అన్నది కూడా స్పష్టత లేకుండా ఉందని వారు ప్రశ్నిస్తున్నారు.
ఏది చూడకుండా ఇచ్చిన పలు శాఖల అనుమతులను, పునః పరిశీలన చేసి రద్దు చెయ్యాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.. ఈ వ్యవహారంపై ప్రశ్నించిన కొందరు గ్రామస్తులపై, అక్రమ కేసులు నమోదు చేశారనే ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చిన వారిపైనే ఒత్తిళ్లు, బెదిరింపులు, కేసులు కావాలనే నమోదవుతున్నాయా అనే సందేహాలు కూడా ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి.!? ఈ అక్రమ కేసుల విషయంలో సంబంధిత ఎస్ఐపై కూడా, ఉన్నత అధికారులు చర్యలు తీసుకున్నారని తెలుస్తుంది.¡
-
అధికారుల మౌనం ఎందుకు..నిర్మాణాలకు అన్ని అనుమతులు ఉన్నాయా?
ఈ వ్యవహారంపై నల్లగొండ జిల్లా కలెక్టర్కు, స్థానిక అధికారులకు కూడా పలుమార్లు ప్రజలు ఫిర్యాదులు అందజేశారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించలేదని వారు చెబుతున్నారు. ప్రజల విజ్ఞప్తులు అధికార యంత్రాంగం దృష్టికి చేరినా, వాటిపై కార్యాచరణ ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, చట్టబద్ధ అనుమతులు ఈ మూడు అంశాలపై ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. ఈ ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని, చట్టవిరుద్ధ చర్యలు జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కేవలం మిగతా శాఖల అనుమతుల కోసం, గ్రామ పంచాయతీ అనుమతులు మాత్రమే తీసుకొని, అవే నిర్మాణ అనుమతులు అనే మాదిరిగా, యాజమాన్యం చూపుతుందని స్థానికులు అంటున్నారు. నిర్మాణానికి సంబందించిన డీటీసీపీ, హెచ్ఎండిఏ అనుమతులు లేనేలేవు అని, అలాంటప్పుడు జరుగుతున్న నిర్మాణాలను మండల ఎంపివో ఎందుకు ఆపడం లేదని, కేవలం నోటీసులకే పరిమితమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఈ వ్యవహారంలో ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ప్రజా సమస్యపై చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు..
