తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరోసారి ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రాబోయే వానాకాలం ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతు భరోసా నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రైతులు సాగు పనులను సకాలంలో ప్రారంభించేందుకు అవసరమైన పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ నెల 26 నుంచి రైతు భరోసా నిధులను లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా నిధులు విడుదల చేయాలని వ్యవసాయ, ఆర్థిక శాఖల అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.50 కోట్ల ఎకరాల సాగుభూమికి ఎకరాకు రూ.6000 చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు సుమారు రూ.9000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మొత్తాన్ని వ్యవసాయ శాఖకు విడుదల చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుండగా, రైతు భరోసా నిధుల విడుదల అంశానికి ఆ సమావేశంలో ఆమోదం లభించనుంది. కేబినెట్ ఆమోదం అనంతరం నిధుల బదిలీ ప్రక్రియను వెంటనే ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు ఒకేసారి కాకుండా విడతల వారీగా నిధులను జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో జూన్ 26న ఎకరంలోపు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. మొదటి రోజే సుమారు 73 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. అనంతరం మిగిలిన రైతులకు వారి భూవిస్తీర్ణం ఆధారంగా దశలవారీగా నిధులు బదిలీ చేయనున్నారు. అన్ని చెల్లింపులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా రైతులకు మరో కీలక శుభవార్తను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సన్న బియ్యం ఉత్పత్తిని ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సన్న వడ్ల సాగు చేసే రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా 7 రకాల సన్న వడ్ల విత్తనాలను సబ్సిడీపై అందించాలని నిర్ణయించింది. ఈ విత్తనాలను రాష్ట్రంలోని రైతు వేదికల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతు వేదికలు కేవలం సమావేశాల నిర్వహణకే పరిమితం కాకుండా రైతులకు అవసరమైన సేవలు అందించే సమగ్ర కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు.
రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖలకు చెందిన ఒక్కో అధికారి ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రైతు వేదికల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను అదనపు కలెక్టర్లకు అప్పగించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. సన్న వడ్లకు ప్రభుత్వం ఇప్పటికే బోనస్ అందిస్తున్న నేపథ్యంలో రైతులు అధికంగా ఈ పంట సాగు చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అందుకే ఆ అవసరాలకు అనుగుణంగా 7 రకాల సన్న వడ్ల విత్తనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది.
వ్యవసాయ రంగాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు విత్తనాల సరఫరా నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకు ప్రతి దశలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రైతులు పంట విత్తిన నాటి నుంచే వారి వివరాలు, పంటల వివరాలు, దిగుబడి అంచనాలు, డిజిటల్ భూ మ్యాపింగ్ సమాచారం, ధాన్యం కొనుగోలు వివరాలు వంటి సమగ్ర సమాచారాన్ని వ్యవసాయ శాఖ వద్ద అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించడం ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికార వర్గాలు చెబుతున్నాయి. రైతు భరోసా నిధుల విడుదలతో పాటు సబ్సిడీ విత్తనాల పంపిణీ నిర్ణయం రాష్ట్ర రైతులకు సాగు సీజన్ ప్రారంభంలోనే పెద్ద ఊరటనివ్వనుందని భావిస్తున్నారు.
ALSO READ: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. తల్లికి వందనం డబ్బులు పడేది అప్పుడే..