NEET Re-Exam: నీట్ యూజీ పరీక్షను పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21న జరగనున్న రీ ఎగ్జామ్ ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ టెలిగ్రాంపై తాత్కాలిక ఆంక్షలు విధించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు జూన్ 22 వరకు టెలిగ్రాం సేవలను నిలిపివేయగా, జూన్ 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ ను నిలిపివేయాలని కంపెనీకి సూచించింది.
నీట్ పరీక్ష పేపర్ల లీక్ ను అడ్డుకునేందుకే!
నీట్ పరీక్షకు సంబంధించిన తప్పుడు ప్రచారాలు, ప్రశ్నాపత్రాల లీకేజీపై వస్తున్న వదంతులు, అలాగే అభ్యర్థులను మోసం చేసే ముఠాల కార్యకలాపాలను అడ్డుకోవడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ (ఎన్టీఏ) సిఫారసుల ఆధారంగా తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని ఎన్టీఏ స్వాగతించింది. పరీక్షను సురక్షిత వాతావరణంలో నిర్వహించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. ఇప్పటికే విద్యార్థులను తప్పుదోవ పట్టించే కొన్ని టెలిగ్రాం ఛానళ్లను మూసివేసినట్లు కూడా గుర్తుచేసింది. కొందరు వ్యక్తులు టెలిగ్రాంలో నీట్ ప్రశ్నపత్రాలు అమ్ముతున్నట్లు ప్రచారం చేస్తున్నప్పటికీ, అవన్నీ పూర్తిగా అసత్యమని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ స్పష్టం చేశారు.
రాజస్థాన్ లో ఇద్దరు అరెస్ట్
అటు ఇదిలా ఉండగా, నీట్ ప్రశ్నపత్రాలు విక్రయిస్తామని ప్రచారం చేసిన రాజస్థాన్‌కు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి టెలిగ్రాం యాప్‌ను తొలగించినట్లు సమాచారం. యాపిల్ కూడా ఇదే తరహా చర్యలు తీసుకునే అవకాశముంది. అయితే దేశవ్యాప్తంగా కొంతమందికి టెలిగ్రాం ఇంకా పనిచేస్తుండటం విశేషం. సాంకేతిక కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ప్రభుత్వం నిషేధం విధిస్తే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు దానిని అమలు చేస్తారు. కానీ, టెలిగ్రాం సాంకేతిక నిర్మాణం భిన్నంగా ఉండటంతో పూర్తి స్థాయిలో నిలిపివేయడం కొంత కష్టంగా మారిందని వారు వివరిస్తున్నారు.