Crime Mirror, AP State Bureau: ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి లడ్డూ నాణ్యత, భద్రత, పోషక విలువలను మరింత మెరుగుపరచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మైసూరుకు చెందిన కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థ సీఎస్ఐఆర్-సీఎఫ్టీఆర్ఐ (Central Food Technological Research Institute)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
Also Read: హైదరాబాద్లోని ఆ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు..
బెంగళూరులో నిర్వహించిన రైజ్ కాంక్లేవ్ సదస్సులో ఈ ఒప్పందం అధికారికంగా జరిగింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార భద్రత శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో టీటీడీ, సీఎస్ఐఆర్ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దేశంలోని దేవాలయాల చరిత్రలో ఈ తరహా ఒప్పందం జరగడం ఇదే తొలిసారి కావడం విశేషంగా మారింది.
ఈ ఒప్పందం ద్వారా తిరుమల లడ్డూతో పాటు ఇతర ప్రసాదాల తయారీ ప్రక్రియలో శాస్త్రీయ ప్రమాణాలను అమలు చేయనున్నారు. ముడి పదార్థాల కొనుగోలు నుంచి నిల్వ, తయారీ, పంపిణీ వరకు ప్రతి దశలో నాణ్యత నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు. అలాగే కలుషిత ప్రమాదాలను తగ్గించేందుకు ఆధునిక పరీక్షా విధానాలు, సాంకేతిక పద్ధతులను వినియోగించనున్నారు.
Also Read: అమరనాథ రెడ్డి మౌనం వెనుక కారణం ఏంటీ…?
ప్రసాదాల రుచి, సంప్రదాయ స్వరూపానికి ఎలాంటి భంగం కలగకుండా వాటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే అంశాలపై కూడా పరిశోధనలు జరగనున్నాయి. ప్రత్యేక ప్యాకేజింగ్ విధానాలను అభివృద్ధి చేసి భక్తులకు మరింత నాణ్యమైన ప్రసాదాలను అందించేలా చర్యలు తీసుకోనున్నారు.
అంతేకాకుండా టీటీడీ ఫుడ్ అనలిస్టులు, సంబంధిత సిబ్బందికి ఆధునిక పరీక్షా విధానాలు, నెయ్యి స్వచ్ఛత నిర్ధారణ, నమూనాల సేకరణ, కలుషిత పదార్థాల గుర్తింపు వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. సీఎస్ఐఆర్-సీఎఫ్టీఆర్ఐ శాస్త్రవేత్తలు కూడా తరచూ తిరుమల కేంద్రాలను సందర్శించి సాంకేతిక సహకారం అందించనున్నారు.
Also Read: మూడేళ్ల ముందే హీటెక్కిన నెల్లూరు రాజకీయం…!
ఈ చర్యలతో శ్రీవారి లడ్డూ నాణ్యత మరింత మెరుగుపడటమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల్లో విశ్వాసం మరింత బలపడుతుందని టీటీడీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: అడవిలో అన్నలు ఉంటే.. అప్పట్లో ఇక్కడ ధైర్యం ఉండేది…కవిత ఆసక్తికర వ్యాఖ్యలు..