Homeట్రావెల్అభివృద్ధి దిశగా తెలంగాణ అన్నవరం

అభివృద్ధి దిశగా తెలంగాణ అన్నవరం

  •  రూ. 70 కోట్లు వ్యయం తో ప్రాజెక్టు పనులు
  •  గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతకు కూడా ప్రాధాన్యం

తెలంగాణలో ఆధ్యాత్మిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తూ ముందుకు సాగుతోంది. దేవాలయాల పునరుద్ధరణతో పాటు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్య, వైద్య, వ్యవసాయ రంగాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని గూడెం రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో సుమారు రూ.70 కోట్ల వ్యయంతో ఈ తెలంగాణ అన్నవరాన్నీ అద్భుతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పనులకు శనివారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను వేగంగా అమలు చేయడంలో ప్రభుత్వం ముందంజలో ఉందని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన సభలో ఆలయ అభివృద్ధి అంశం ప్రస్తావనకు రావడంతో కేవలం కొద్ది రోజుల్లోనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి గత రెండున్నర సంవత్సరాల్లోనే వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా గోదావరి పుష్కరాల దృష్ట్యా భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ఘాట్ల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

బాసర నుంచి భద్రాచలం వరకు ఆధ్యాత్మిక కారిడార్ రూపకల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ఈ మార్గంలో ఉన్న పుణ్యక్షేత్రాల అభివృద్ధి, సుందరీకరణ కోసం వందల కోట్ల రూపాయలు కేటాయించి పనులు కొనసాగుతున్నాయని వివరించారు.

ఆధ్యాత్మిక రంగంతో పాటు గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. డ్వాక్రా మహిళలకు ప్రత్యేక భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించగా, వ్యవసాయానికి అవసరమైన సాగునీటి ప్రాజెక్టులపై కూడా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గూడెం ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి కూడా భారీ నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడం రైతులకు మేలు చేస్తుందని పేర్కొన్నారు.

మంచిర్యాల ప్రాంత అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు సమగ్ర ప్రణాళికతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేయడమే ప్రజాప్రతినిధుల బాధ్యత అని, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

ALSO READ: జీడిమెట్లలో అక్రమంగా నివాసం.. ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు