Homeఆంధ్ర ప్రదేశ్అగ్రిగోల్డ్ బాధితులకు ఉపశమనం.. ప్రత్యేక కోర్టులో నియామకాలు, నిధులు!!

అగ్రిగోల్డ్ బాధితులకు ఉపశమనం.. ప్రత్యేక కోర్టులో నియామకాలు, నిధులు!!

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో కీలక పరిణామం. వారికి ఊరటనిస్తూ ఏపీ ప్రభుత్వం ఒక్క నిర్ణయం తీసుకుంది. అగ్రిగోల్డ్ కేసులతో పాటుగా డిపాజిటర్ల కేసులను విచారణ చేసేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు సంబంధించి ముందడుగు పడింది. ఈ ప్రత్యేక కోర్టు కోసం 21 పోస్టులు, నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పోస్టుల్లో జిల్లా జడ్జి, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సహా పలు పోస్టులు ఉన్నాయి. కోర్టుకు సంబంధించిన ఖర్చులకోసం ఐదు లక్షలు, కోర్టులో లైబ్రరీ, ఫర్నిచర్ కోసం పది లక్షలు కేటాయించారు. ఈ స్పెషల్ కోర్టులో అగ్రిగోల్డ్ కేసులతో పాటుగా ఏపీ డిపాజిటర్ల రక్షణ చట్టం కింద నమోదైన కేసులను విచారణ చేస్తారు. విజయవాడలోనే ఈ కోర్టు ఏర్పాటు కానుంది.

దశాబ్ద కాలంగా..

దశాబ్ద కాలానికి పైగా ఏపీలో అగ్రిగోల్డ్ వివాదం నడుస్తూ ఉంది. వాస్తవానికి 2016 లోనే విజయవాడలో డిపాజిటర్ల చట్టం కింద కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పటి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. హైకోర్టు రిజిస్ట్రీ సిబ్బంది కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే తాజాగా ఈ పోస్టులను కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ ప్రత్యేక కోర్టు కార్యకలాపాలను ప్రారంభించనుంది. అగ్రిగోల్డ్ కేసుల విచారణ వేగవంతం కానుంది. గత నెలలో నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో అగ్రిగోల్డ్ అంశంపై చర్చ జరిగింది. అగ్రిగోల్డ్ సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు అయింది. బాధితులకు ఆరు నెలల్లో న్యాయం జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇప్పుడు ఆదేశాలకు అనుగుణంగా కోర్టుకు సంబంధించిన నియామకాలు, నిధులు విడుదల కావడం విశేషం.

దాదాపు 20 లక్షల మంది డిపాజిటర్లు..

అగ్రిగోల్డ్ సంస్థ అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. 1995లో ఈ సంస్థ ప్రారంభం అయ్యింది. జనం దగ్గర నుంచి నెలవారి వాయిదా పద్ధతుల్లో డిపాజిట్లను సేకరించింది. గడువు ముగిసిన తర్వాత రెట్టింపు డబ్బులు, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పింది. అగ్రిగోల్డ్ ఏజెంట్ల ద్వారా లక్షలాది మంది డబ్బులు కూడా కట్టారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో సహా ఎనిమిది రాష్ట్రాల్లో 20 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. 2014 నాటికి అగ్రిగోల్డ్ కు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. డబ్బులు కట్టిన వారికి తిరిగి చెల్లింపులు చేయలేదు. ప్లాట్లు కూడా ఇవ్వలేదు. బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమన్నారు. దాదాపు 6 వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇది. దీనిపై సిఐడి తో పాటు ఈడి విచారణ కొనసాగింది. సమస్త ప్రమోటర్లను అరెస్టు చేసి ఆస్తులను, భూములను అటాచ్ చేశారు. వైసిపి హయాంలో పదివేల లోపు డిపాజిట్లు చేసిన వారికి చెల్లింపులు జరిగాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు