క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఒక్కసారి గెలిచినవారు ఓడిపోరని గ్యారెంటీ ఉండదు. ఓడిపోయిన వారు మళ్లీ అధికారంలోకి రారు అని అనుకోకూడదు కూడా. అయితే రాజకీయాలు రాజకీయంలాగే చేస్తేనే అటువంటి పార్టీలకు మనుగడ ఉంటుంది. ప్రత్యర్థి పక్షాన్ని పూర్తిగా భూస్థాపితం చేయాలని.. విపక్షం లేకుండా చేయాలని ఏ పాలకుడైన భావిస్తే అది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి ఎదురైన పరిస్థితి ఉంటుంది. అధికారం చేతిలో ఉంది కదా అని ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించడం, శారీరక దాడులకు దిగడం, వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకోవడం వంటివి చేస్తే ప్రజా వ్యతిరేకత తప్పదు. ఇప్పుడు మమతా బెనర్జీ పతనానికి అవే కారణం.
అప్పట్లో చెలరేగిన హింస..
మమతా బెనర్జీ బెంగాల్లో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. 2021 ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత బెంగాల్లో హింస చెలరేగింది. విపక్ష కార్యకర్తలపై జరిగిన దాడులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అయితే భయం అనేది ప్రజాస్వామ్యంలో ఎప్పటికీ అమ్ముడుపోదు. తాత్కాలికంగా నోరు నోకియా చేయగలరేమో కానీ.. లోలోపల పెరిగే అసంతృప్తిని, కసిని ఎవరు ఆపలేరు. ఓటు అనే ఆయుధం సామాన్యుడు చేతికి దొరికిన రోజు ఆ భయం ఎలా బద్దలవుతుందో బెంగాల్లో రుచి చూశారు మమతా బెనర్జీ. ఆమె ఘోర ఓటమి దీనిని స్పష్టంగా తెలియజేసింది. అయితే అంతకుముందు ఏపీలో కూడా అదే జరిగిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి.
కాంగ్రెస్ పంచన..
దేశ రాజకీయాలని శాసిస్తాను అని మమతా బెనర్జీ గట్టి శపథమే చేసారు. చివరకు కాంగ్రెస్ పార్టీని కూడా లెక్క చేయలేదు. ఆ పార్టీని ఒక గడ్డి పరక కింద తీసి పడేశారు. ఇప్పుడు తన పార్టీని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు అదే కాంగ్రెస్ గొడుగు కిందకు చేరారు. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీతో పాటు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మాత్రమే మిగిలినట్లు కనిపిస్తున్నారు. కేవలం కుటుంబ సభ్యులను, సొంత కోటరిని నమ్ముకుని సామాన్య ప్రజలను, ప్రజాస్వామ్య విలువలను విస్మరిస్తే ఏ నాయకుడైన రాజకీయంగా ఏకాకి కావడం ఖాయం. ఇది మమతా బెనర్జీ కి ఎదురైన గుణపాఠం కూడా. ముఖ్యంగా అధికార పార్టీలు మమతా బెనర్జీ ఉదంతాన్ని ఒక గుణపాఠంగా తీర్చుకోవాల్సిన అవసరం ఉంది