క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థులు రజనీష్ అగర్వాల్, తరుణ్ చుగ్, మహేష్ కేవత్ ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఎన్నిక అనివార్యం కాకుండా పోయింది. దీంతో ఓటింగ్ నిర్వహించాల్సిన అవసరం లేకుండానే ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజేతలుగా ప్రకటించబడ్డారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రజనీష్ అగర్వాల్, మధ్యప్రదేశ్ రాష్ట్ర మత్స్య సంక్షేమ బోర్డు మాజీ చైర్మన్ మహేష్ కేవత్ రాజ్యసభ అభ్యర్థులుగా ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
విజయం అనంతరం రజనీష్ అగర్వాల్, తరుణ్ చుగ్, మహేష్ కేవత్ మధ్యప్రదేశ్ అసెంబ్లీకి చేరుకుని తమ ఎన్నిక ధ్రువీకరణ పత్రాలను స్వీకరించారు. మరోవైపు రాజస్థాన్‌లో కూడా రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ముగియగా, బీజేపీ నుంచి సతీష్ పూనియా, అల్కా గుర్జర్, కాంగ్రెస్ నుంచి నీరజ్ డాంగీ విజయం సాధించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత వీరిని ఎన్నికైన సభ్యులుగా ప్రకటించారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం రాజకీయంగా, న్యాయపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తన నామినేషన్‌ను చట్టవిరుద్ధంగా తిరస్కరించారని ఆరోపిస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం (జూన్ 12) విచారణ జరగనుంది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అతుల్ ఎస్. చందుర్కర్‌ల ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.