క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ అభ్యర్థిగా దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరించడం వెనుక రాష్ట్రంలోని ఆ పార్టీ నేత హస్తం ఉందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఆమెకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందన్నారు. మీనాక్షి నటరాజన్‌పై కేసు ఉన్నట్లు తెలంగాణ నుంచే తమకు సమచారం అందిందని మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రే చెప్పారని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ కేసును బీజేపీ మంత్రికి లీక్ చేసింది ఎవరని.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. మీనాక్షి నటరాజన్ కేసును లీక్ చేసింది ఎవరనే దానిపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్), జ్యుడీషియరీ ఎంక్వైరీ వేస్తావా? అంటూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి చెప్పిన వ్యక్తికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వలేదని విమర్శించారు.
అందుకే ఆ వ్యక్తి మధ్యప్రదేశ్ మంత్రికి సమాచారం ఇచ్చారని తెలిపారు. దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు ఉన్నారని చెప్పారు. రూ. 100 కోట్లతో తన నివాసం సమీపంలో బోధి పెవిలియన్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి నివాసం నిర్మిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. ఈ ఇంటి నిర్మాణం కోసం పదుల సార్లు సీఎం అక్కడికి వెళ్లారని చెప్పారు. ఇనుప కంచెలకి రూ.17 కోట్లు.. రక్షణ కోసం, ఫుట్ బాల్ ఆడేందుకు రూ.10 కోట్లు కేటాయించారన్నారు. అలాగే కౌన్సిల్‌లో సీఎం ఛాంబర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. పని చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇన్ని క్యాంపు కార్యాలయాలు ఎందుకు? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రజాధనం వృధా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 7 కోట్లతో జీవో ఇచ్చి ఇప్పటికే రూ.70 కోట్ల పైన ఖర్చు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నగదు లేదు కానీ సీఎం సోకులకు రూ. వందల కోట్లు ఖర్చు పెడతారా? అంటూ హరీశ్ రావు అసహనం వ్యక్తం చేశారు.