Hometelanganaఅంగన్వాడి టీచర్ వద్ద ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తులు.. ఎంపీడీఓ సమాధానంపై లబ్ధిదారుడి ఆగ్రహం

అంగన్వాడి టీచర్ వద్ద ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తులు.. ఎంపీడీఓ సమాధానంపై లబ్ధిదారుడి ఆగ్రహం

  • బ్యాంకు, అధికారుల మాటల్లో పొంతన లేకపోవడం
  • దరఖాస్తులు అంగన్వాడి కేంద్రానికి ఎలా చేరాయి..?
  • లబ్ధిదారులకు న్యాయం ఎప్పుడు..?
  • అధికారుల నిర్లక్ష్యంపై విచారణకు డిమాండ్

క్రైమ్ మిర్రర్, హత్నూర ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా పరిధిలోని చింతల్‌చెరు గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తుల వ్యవహారం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ప్రభుత్వం ఎస్సీ వర్గాల ఆర్థికాభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రుణ పథకాల దరఖాస్తులు సంబంధిత కార్యాలయాల్లో కాకుండా అంగన్వాడి టీచర్ వద్ద నెల రోజులుగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. చింతల్ చెరు గ్రామానికి చెందిన లబ్ధిదారుడు లింగమోళ్ల రాజు బుధవారం ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ రుణం కోసం తాను దరఖాస్తు చేసుకున్నప్పటికీ తన దరఖాస్తు ఏ దశలో ఉందో తెలియక పలుమార్లు అధికారులను సంప్రదించినట్లు తెలిపారు. అయితే ఎంపీడీఓ కార్యాలయాన్ని సంప్రదించగా తమకు ఈ విషయంపై సమాచారం లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు ఆయన ఆరోపించారు. అదే విషయమై బ్యాంకు అధికారులను అడిగితే సంబంధిత దరఖాస్తులు అర్హత పొందలేదని చెప్పారని రాజు తెలిపారు. అయితే అనంతరం విచారణలో ఆ దరఖాస్తులు చింతల్‌చెరు అంగన్వాడి టీచర్ వద్ద ఉన్నట్లు తెలిసి ఆశ్చర్యానికి గురయ్యామని పేర్కొన్నారు.
స్థానికంగా అందిన సమాచారం ప్రకారం, గుర్తు తెలియని వ్యక్తి ఒకరు బస్సులో ప్రయాణిస్తూ ఆ దరఖాస్తుల ఫైళ్లను అంగన్వాడి టీచర్‌కు అందజేసినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వ రుణాలకు సంబంధించిన కీలకమైన దరఖాస్తులు అధికారిక కార్యాలయాలకు చేరకుండా ఒక అంగన్వాడి సిబ్బంది వద్దకు ఎలా వచ్చాయన్న ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా మారింది.
ముఖ్యంగా నెల రోజులుగా ఆ దరఖాస్తులు అక్కడే ఉండటం, వాటి గురించి సంబంధిత శాఖలకు సమాచారం లేకపోవడం, లబ్ధిదారులకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ వ్యవహారంలో ఎవరి బాధ్యత ఎంత.? దరఖాస్తులు ఎందుకు పెండింగ్‌లో పడ్డాయి.? వాటిని ఎవరు అంగన్వాడి టీచర్ వద్ద ఉంచారు.? అనే ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానం లభించలేదు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా బలపడేలా చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఇలాంటి నిర్లక్ష్య ధోరణి అడ్డంకిగా మారుతోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయకపోవడం వల్ల నిజమైన అర్హులు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు.
ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే దృష్టి సారించి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని గ్రామస్తులు, లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. దరఖాస్తుల నిర్వహణలో జరిగిన నిర్లక్ష్యంపై బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలులో క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిర్లక్ష్యం కారణంగా లబ్ధిదారులు నష్టపోతున్నారనే విషయాన్ని చింతల్‌చెరు ఘటన మరోసారి స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై అధికారులు ఎలా స్పందిస్తారు.? బాధ్యులపై చర్యలు ఉంటాయా.? అనే అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు