-
పూరీ జగన్నాథ్ ఇంట తీవ్ర విషాదం..!
-
కూతురు పవిత్ర భావోద్వేగ పోస్ట్
Crime Mirror, Cinema Updates: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి, పవిత్రకు నానమ్మ మరణించిన విషయం కుటుంబ సభ్యులను, అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషయాన్ని పూరీ జగన్నాథ్ కుమార్తె పవిత్ర సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా, సినీ ప్రముఖులు, అభిమానులు కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నానమ్మతో కలిసి దిగిన ఫోటోను పంచుకున్న పవిత్ర, హృదయాన్ని తాకే సందేశాన్ని రాశారు. ఇప్పుడు నన్నెవరు చిన్నతల్లి అని పిలుస్తారు? ప్రేమగా నన్నెవరు ముద్దుపెడతారు? నీతో మరోరోజు గడిపే అవకాశం వస్తే బాగుండేది.
నీ 96వ పుట్టినరోజున ఇచ్చినట్లే మరోసారి పెద్ద హగ్ ఇస్తా. ఐ మిస్ యూ నానమ్మ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతూ నివాళులు అర్పిస్తున్నారు.
పూరీ జగన్నాథ్ కుటుంబం ఎప్పుడూ వ్యక్తిగత విషయాలను పెద్దగా బయటపెట్టదు. అలాంటి కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాద వార్త సినీ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు సంతాప సందేశాలు తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, పూరీ జగన్నాథ్ ప్రస్తుతం తన కొత్త చిత్రం స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషిస్తుండగా, టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం.
పూరీ కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రొల్లా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ సమయంలో కుటుంబంలో విషాదం చోటుచేసుకోవడంతో పూరీ జగన్నాథ్ కుటుంబానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
