•చంద్రబాబు, లోకేష్ గ్రీన్ సిగ్నల్
•వచ్చే ఏడాది చైర్మన్ మోసేన్ రాజు పదవి విరమణ
•తగ్గనున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:- ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. అప్రతిహస విజయం దక్కించుకుంది కూటమి. కానీ దానికి ఒక లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అదే శాసనమండలి. అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉండడమే కాదు. చైర్మన్ గా ఆ పార్టీకి చెందిన మోసేన్ రాజు ఉన్నారు. దీంతో ఇప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోంది శాసనమండలిలో. చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు గుడ్ బై చెబితే.. వారి రాజీనామాలను సైతం ఆమోదించలేదు చైర్మన్ మోసేన్ రాజు. అయితే వచ్చే ఏడాది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గడంతో పాటు చైర్మన్ మోసేన్ రాజు సైతం పదవీ విరమణ చేయనున్నారు. కూటమికి శాసనమండలిలో స్పష్టమైన మెజారిటీ రానుంది. ఈ నేపథ్యంలో శాసనమండలి చైర్మన్ గా కావలి గ్రీష్మ పేరును సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
సుదీర్ఘ నేపథ్యం..
ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందారు కావలి ప్రతిభా భారతి. సుదీర్ఘకాలం ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా, శాసనసభ తొలి మహిళా స్పీకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆమె తండ్రి కొత్తపల్లి పున్నయ్య ప్రముఖ న్యాయమూర్తి కూడా. ఆయన వారసురాలుగా నందమూరి తారక రామారావు పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు ప్రతిభా భారతి. 1983 నుంచి 1999 వరకు ఎచ్చెర్ల శాసన సభ్యురాలిగా ఎన్నికయ్యారు ప్రతిభా భారతి. టిడిపి ఆవిర్భవించిన తర్వాత 1983లో జరిగిన ఎన్నికల్లో.. టిడిపికి తొలి విజయం ప్రతిభా భారతి ద్వారానే. అందుకే నందమూరి తారక రామారావు ప్రతిభాభారతికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. 1999లో అయితే ప్రతిభా భారతి శాసనసభ స్పీకర్ గా తనదైన గుర్తింపును దక్కించుకున్నారు. ఆమె సభను నడిపించిన తీరు ప్రతిపక్ష పార్టీ నేతల అభిమానాన్ని సైతం సొంతం చేసుకుంది..
వారసురాలిగా..
2009లో నియోజకవర్గాల పునర్విభజనతో ఎచ్చెర్ల బీసీ జనరల్ గా మారింది. రాజాం ఎస్సీ రిజర్వేషన్ కు మారింది. దీంతో 2014 ఎన్నికల్లో రాజాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ప్రతిభా భారతి. ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూసినా చంద్రబాబు ప్రతిభా భారతి సేవలను గుర్తించి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఆ సమయంలోనే ప్రతిభా భారతి వారసురాలిగా ఆమె కుమార్తె గ్రీష్మ తెరపైకి వచ్చారు. తల్లికి తగ్గ తనయురాలిగా రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. ప్రత్యర్థులపై పదునైన వస్త్రాలతో గ్రీష్మ విరుచుకుపడే తీరు ప్రత్యేక అభినందనలను అందుకుంది. వైసిపి హయాంలో కనీసం మాట్లాడేందుకు టిడిపి నేతలు భయపడేవారు. అటువంటిది తొడగొట్టి సవాల్ చేసిన చరిత్ర గ్రీష్మది.
వరుసగా పదవులు..
రాజాం అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఆశించారు గ్రీష్మ. కానీ వివిధ సమీకరణలో భాగంగా ఆమెకు అవకాశం దక్కలేదు. అయినా నిరాశ చెందలేదు గ్రీష్మ. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారు. ఆమె సేవలను గుర్తించిన సీఎం చంద్రబాబు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి కేటాయించారు. తరువాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అప్పటినుంచి శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఎదుర్కొంటూ వస్తున్నారు గ్రీష్మ. అందుకే వచ్చే ఏడాదిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో బలం పూర్తిగా తగ్గిపోతుంది. మండలి చైర్మన్ గా ఉన్న మోసేన్ రాజు పదవీ విరమణ చేస్తారు. దీంతో శాసనమండలి అంతా టిడిపి కూటమి చేతిలోకి వస్తుంది. అయితే మండలి చైర్ పర్సన్ గా కావలి గ్రీష్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమెను చైర్ పర్సన్ గా నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఉంది. ఎస్సీ మహిళ, ఆపై సుదీర్ఘ నేపథ్యం ఉన్న రాజకీయ కుటుంబం, తెలుగుదేశం పార్టీ పట్ల విధేయత వంటి కారణాలతో.. ఆమె వైపు చంద్రబాబుతో పాటు లోకేష్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.