క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై పోరుకు వైసీపీ సిద్ధమవుతోంది. రెండేళ్ల పాలనలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్ధేశంతో వైసీపీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం ఆ పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో బుక్ విడుదల చేసిన జగన్.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన కేడర్‌కు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న విధానాలను పోరాటం ద్వారా ప్రజల్లోకి వైసీపీ కేడర్ తీసుకెళ్లాలని జగన్ సూచించారు. ఈ మేరకు పోరాటానికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది.
నాలుగు నుంచి 12 వరకు నిరసనలు..
కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలని సూచించిన జగన్.. ఈ మేరకు పార్టీ శ్రేణులకు దిశా, నిర్ధేశం చేశారు. వెన్నుపోటుకు రెండేళ్లు అనే పేరును పార్టీ కేడర్ చేసే పోరుకు పేరు పెట్టారు. జూన్ నాలుగో తేదీ నుంచి 12 వరకు ఈ పోరు కొనసాగనుంది. జూన్ నాలుగో తేదీన మండల కేంద్రాల్లో వైసీపీ నిరసనలు నిర్వహించనున్నాయి. జూన్ ఎనిమిది నుంచి తొమ్మిదో తేదీన నియోజకవర్గ కేంద్రాల్లో టౌన్ హాల్లో సదస్సులు నిర్వహించాలని పార్టీ ఆదేశించింది. ఆయా సదస్సుల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే, జూన్ 12న ప్రతి నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా ర్యాలీలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ నిర్ణయంతో వైసీపీ పూర్తిస్థాయిలో కూటమి ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతున్నట్టు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత ఇచ్చిన పిలుపు మేరకు ఒకరోజు నిరసన కార్యక్రమాలను మాత్రమే నిర్వహిస్తూ వస్తున్నారు. కొన్ని రోజులపాటు నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వ అసమర్థ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని వైసీపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఈ ఆందోళన కార్యక్రమాలు స్తబ్ధుగా ఉన్న పార్టీ కేడర్‌లో జోష్‌ను నింపుతాయని కూడా వైసీపీ నాయకత్వం భావిస్తోంది. మరి అధినేత పిలుపునకు కేడర్ ఏ స్థాయిలో స్పందించి క్షేత్రస్థాయిలో పోరును కొనసాగిస్తాయో చూడాల్సి ఉంది.