క్రైమ్ మిర్రర్, క్రైమ్ న్యూస్:- సినిమాలకు ఏమాత్రం తీసిపోని కథ. ట్విస్టుల మీద ట్విస్టులతో కూడిన యదార్ధ ఘటన. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి పోలీసులకు మస్కా కొట్టి గడిచిన 12 ఏళ్లుగా అనేక సినిమాలో నటించిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి సినిమాల్లో నటించినప్పటికీ అతడిని గుర్తించలేకపోయినా పరిస్థితి పోలీసులది. ఇది గుజరాత్ కు సంబంధించిన ఒక ఘరానా మోసగాడి అసలు కథ. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. స్పందన మోడీ, స్పందన వ్యాస్, స్పందన కుమార్, స్పందన జోషి, హేమంగు మోదీ, హేమంంగ్ వ్యాస్, హేమంగు వైష్ణవ్.. వంటి విభిన్నమైన పేర్లతో పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తి పోలీసులకు కన్నుగప్పాడు. ఒక మర్డర్ కేసులో నిందితుడిగా పెరోల్ మీద బయటకు వచ్చి ఇలా పేర్లు, వేషాలు మార్చుకుంటూ 12 ఏళ్ల పాటు పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరిగాడు గుజరాత్ కు చెందిన హేమంత్. అలా అని ఎక్కడో దాకోలేదు. బయట ప్రపంచానికి కనపడకుండా ఉండలేదు. పేర్లు మార్చుకొని అనేక సీరియల్లో, వెబ్ సిరీస్లో, సినిమాల్లోనూ నటించాడు. ఒక ఘరానా మోసగాడు ఈ తరహా వ్యవహారాలకు పాల్పడడం ఇదే తొలిసారి. హేమంత్ అమీర్ ఖాన్ నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, మోహన్లాల్ నటించిన ఎంపురాన్ లాంటి సినిమాల్లో కూడా నటించాడంటే హేమంత్ ఏ స్థాయిలో పోలీసులను మోసం చేశాడో అర్థం చేసుకోవచ్చు.
అగ్ర తారల సినిమాల్లోనూ నటించిన హేమంత్..
ఒక మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్ కొన్నాళ్ల కిందట పెరోల్ పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత తనకు ఆసక్తి ఉన్న సినిమా రంగంలో అవకాశాలను దక్కించుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగించాడు. ఈ క్రమంలోనే అనేక సినిమాల్లో అవకాశాలు దక్కాయి. బాలీవుడ్లో అగ్ర నటులుగా ఉన్న హీరోలతోనూ హేమంత్ నటించాడు. అమితాబ్ బచ్చన్, రణవీర్ సింగ్ వంటి అగ్ర నాయకులు నటించిన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేశాడు. పెరోల్ పై వెళ్లిన నిందితుడి ఆచూకీ లేదంటూ విస్తృతంగా వెతుకుతున్న పోలీసులు సినిమాల్లో ఉన్నప్పటికీ గుర్తించలేకపోవడం గమనార్హం.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అరెస్టు..
హేమంత్ అసలు పేరు హేమంత్ నంగిన్ దాస్ మోడీ. స్వస్థలం అహ్మదాబాద్. అతనికి చిన్నప్పటి నుంచి నటనపై ఎంతో ఇష్టం ఉంది. 2005లో నరోజాలో జరిగిన ఒక హత్య కేసులో హేమంత్ నిందితుడిగా ఉన్నాడు. 2008లో కోర్టు అతని దోషగా ప్రకటిస్తూ జీవిత ఖైదు విధించింది. జైలు శిక్ష అనుభవిస్తున్న హేమంత్ 2014 జూలైలో 30 రోజుల పెరోల్ మీద బయటకు వచ్చాడు. కానీ మళ్ళీ పోలీసులు ఎదుట హేమంత్ లొంగిపోలేదు. తనకు తెలిసిన నాటకాల కంపెనీలో చేరాడు. అక్కడ నుంచి ముంబైకి వెళ్లి సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం హేమంత్ వయసు 53 ఏళ్లు. పారిపోయిన 12 ఏళ్ల తర్వాత ఎవరూ గుర్తుపట్టారు అనుకున్నాడు ఏమోగానీ ఇటీవల అహ్మదాబాద్ వచ్చాడు. ఏమి ఎరుగునట్టుగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అయితే అనుకోకుండా ఒక వ్యక్తి అతని గుర్తించి పోలీసులకు సమాచారాన్ని అందించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హేమంత్ ను అరెస్టు చేశారు. దీంతో 12 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న హేమంత్ మళ్లీ కటకటాల్లోకి వెళ్లినట్టు అయింది.