-
హుటాహుటిన ఢిల్లీకి షర్మిల
రాహుల్ గాంధీతో భేటీ
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో కీలక రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ప్రధానంగా జగన్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. డీజిల్ పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆందోళన కార్యక్రమాలు చేసింది. ఇంకోవైపు ప్రత్యేక ఓటరు జాబితా సవరణను సైతం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. తద్వారా బిజెపికి దూరమవుతున్నట్లు సంకేతాలు పంపిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వైయస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆమె హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. అయితే రాజ్యసభ ఎంపిక కోసమే షర్మిలను కాంగ్రెస్ అగ్ర నాయకత్వం పిలిచిందని అంతా భావించారు. కానీ తెర వెనుక కీలక మంత్రాంగం జరుగుతున్నట్లు సమాచారం.
దక్షిణాదిన మారిన పరిస్థితులతో…
మొన్నటి ఎన్నికల్లో తమిళనాడు నుంచి విజయ్ గెలిచారు. కాంగ్రెస్ సహకారంతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రాజీనామా చేశారు. డీకే శివకుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే మారిన రాజకీయ సమీకరణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. కూటమిలో మూడు పార్టీల మధ్య గట్టి బంధం ఉండడం.. బిజెపి నుంచి తగినంత సహకారం అందకపోవడంతో జగన్మోహన్ రెడ్డి కటీఫ్ చెప్పడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఆ కారణంతోనే…
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా మారిపోవడమే మేలన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లు తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. మరో మూడేళ్ల వ్యవధి మాత్రమే ఉంది. అందుకే జాతీయస్థాయిలో మిగతా పార్టీల అండదండలు అందుకోవాలని చూస్తున్నారు జగన్. పైగా తమిళనాడు నుంచి విజయ్, కర్ణాటక నుంచి డీకే శివకుమార్ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.
అందుకే రాహుల్ గాంధీ సైతం షర్మిలను ఢిల్లీకి పిలిపించుకున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేశారు షర్మిల. ఇకనుంచి జగన్మోహన్ రెడ్డి కాదు కూటమిని టార్గెట్ చేసుకోవాలని రాహుల్ గాంధీ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. కర్ణాటక నుంచి కానీ.. ఢిల్లీ నుంచి కానీ షర్మిలకు రాజ్యసభ ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కూటమి వైపు వస్తే మాత్రం షర్మిల తో రాజీ చేసేందుకు కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ప్రయత్నించే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.