Homeవైరల్Dog Stole Cash Bag: డబ్బుల బ్యాగ్‌ ఎత్తుకెళ్లిన వీధికుక్క.. పోలీసుల గాలింపు!

Dog Stole Cash Bag: డబ్బుల బ్యాగ్‌ ఎత్తుకెళ్లిన వీధికుక్క.. పోలీసుల గాలింపు!

ఉత్తరప్రదేశ్ లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా డబ్బులు దొంగలు ఎత్తుకెళ్లిన వార్తలు వింటుంటాం. కానీ, ఇక్కడ మాత్రం ఓ వీధి కుక్క లక్ష రూపాయల నగదు ఉన్న సంచిని నోట కరచుకుని పారిపోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఆ సంచి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

బిజ్నోర్‌ కు చెందిన ఓ వ్యాపారవేత్త బ్యాంకు నుంచి లక్ష రూపాయల నగదు తీసుకున్నాడు. ఆ డబ్బును ఒక బ్యాగ్‌ లో పెట్టుకుని బైక్‌ పై బయల్దేరాడు. మార్గ మధ్యంలో నమాజ్ సమయం కావడంతో సమీపంలోని మసీదు వద్ద బైక్‌ ను ఆపాడు. డబ్బుల సంచిని బైక్‌ కే తగిలించి, ప్రార్థన కోసం మసీదులోకి వెళ్లిపోయాడు. అదే సమయంలో అక్కడ తిరుగుతున్న ఓ వీధి కుక్క ఆ సంచిని గమనించింది. అందులో తినే పదార్థం ఉందని భావించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. క్షణాల్లోనే ఆ సంచిని నోట కరచుకుని అక్కడి నుంచి పరుగెత్తింది. మసీదు బయట ఎవరూ పెద్దగా గమనించకపోవడంతో కుక్క సులభంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.

కొంతసేపటి తర్వాత నమాజ్ ముగించుకుని బయటకు వచ్చిన వ్యాపారవేత్త బైక్‌ వద్దకు వచ్చాడు. అయితే, అక్కడ సంచి కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్‌ కు గురయ్యాడు. తన డబ్బును ఎవరో దొంగిలించారని భావించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

సీసీటీవీ ఫుటేజీ చూసి అంతా షాక్!

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. మసీదు పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం బయటపడింది. డబ్బుల సంచిని ఎత్తుకెళ్లింది మనిషి కాదని, ఓ వీధి కుక్క అని ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో చూసిన పోలీసులు, వ్యాపారవేత్త  ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఆధారంగా ఆ కుక్క ఎటు వెళ్లిందో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే డబ్బుల సంచి ఎక్కడైనా పడేసి ఉంటుందేమోనని పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు