-
కర్ణాటక నుంచి అనూహ్య ఎంపిక
-
కాంగ్రెస్ హై కమాండ్ గ్రీన్ సిగ్నల్
దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. పది రాష్ట్రాల నుంచి 24 మంది సభ్యులు పదవీ విరమణ ఎన్నికలు నిర్వహిస్తోంది భారత ఎన్నికల సంఘం. ఏపీ నుంచి నలుగురు సభ్యుల పదవీ విరమణతో కొత్త వారి ఎంపిక అనివార్యంగా మారింది. అయితే ఈ నాలుగు పదవులు కూటమి ఖాతాల్లో పడనున్నాయి. అయితే అనూహ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల కు రాజ్యసభ పదవి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి ఆమె రాజ్యసభకు నామినేటెడ్ కావడం ఖాయమని సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా ప్రచారం నడుస్తోంది.
-
సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో..
సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది వైయస్సార్ కుటుంబం. అయితే రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్మోహన్ రెడ్డికి సీఎం పదవి ఇవ్వాలని కోరింది ఆ కుటుంబం. అందుకు అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పింది. జగన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంతో ఆ కుటుంబమంతా అటువైపు వెళ్ళింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ కుటుంబానికి చెందిన షర్మిల, తల్లి విజయమ్మ జగన్మోహన్ రెడ్డిని విభేదించారు. తెలంగాణలో తండ్రి పేరుతో పార్టీ పెట్టుకున్న షర్మిల వర్కౌట్ కాకపోవడంతో తిరిగి కాంగ్రెస్లో విలీనం చేశారు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారు. అయితే పార్టీ విలీన సమయంలోనే రాజ్యసభ పదవి ఇస్తామన్న హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రాజ్యసభకు షర్మిల ఎంపిక కావడం ఖాయమని సమాచారం.
-
ఆ ఇద్దరు నాయకులతో..
కర్ణాటక నుంచి మూడు రాజ్యసభ పదవులు ఖాళీ కాబోతున్నాయి. ఆ మూడు కాంగ్రెస్కే దక్కనున్నాయి. అయితే మూడింటిలో ఒకటి ప్రస్తుత కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఇస్తారని తెలుస్తోంది. కర్ణాటకలో సీఎం పదవి షేరింగ్ సమయం దగ్గర పడడంతో హై కమాండ్ సిద్దరామయ్యను తప్పించి.. ఆ స్థానంలో కొత్త వారిని నియమించాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే ఎట్టి పరిస్థితుల్లో తనకే సీఎం పదవి అంటూ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెబుతున్నారు. మరోవైపు కర్ణాటక నుంచి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం రాజ్యసభ సభ్యుడుగా ఎంపిక కానున్నారు. మూడో పదవి షర్మిలకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి సామాజిక వర్గంతో పాటు రాజశేఖర్ రెడ్డి కుటుంబ అభిమానులను కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళించే ప్రయత్నం అన్నట్టు తెలుస్తోంది. మొత్తానికైతే షర్మిలకు ఎట్టకేలకు అదృష్టం వరించనుందన్నమాట.