Homeక్రైమ్Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.24 కోట్ల మోసం.. బెంగళూరులో షాకింగ్ ఘటన!

Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.24 కోట్ల మోసం.. బెంగళూరులో షాకింగ్ ఘటన!

కర్నాటకలో సైబర్‌ నేరాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని  డిజిటల్‌ అరెస్ట్‌  పేరుతో మోసగాళ్లు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. తాజాగా బెంగళూరులో ఓ రిటైర్డ్‌ టీచర్‌ ఐదు నెలల్లో రూ.24 కోట్లు పోగొట్టుకున్న షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

CBI అధికారులమంటూ బెదిరించి..

శివాజీనగర్‌ కు చెందిన లక్ష్మీరామమూర్తి అనే మహిళ గతంలో దుబాయ్‌లో టీచర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. ఆమెకు బెంగళూరు, ముంబై నగరాల్లో ఆస్తులు ఉన్నాయి. వాటిని అమ్మేసి అమెరికాలో ఉన్న పిల్లల దగ్గర ఉండాలని భావిస్తున్నారు. ఈ సమయంలో ఈ ఏడాది జనవరిలో ఆమెకు కొంతమంది మోసగాళ్లు వీడియో కాల్‌ చేశారు. తాము CBI అధికారులు అంటూ పరిచయం చేసుకున్నారు.

ఆమెపై మనీలాండరింగ్‌, అక్రమ నగదు బదిలీ కేసులు ఉన్నాయని చెబుతూ భయపెట్టారు. మీ బ్యాంకు ఖాతాలను పరిశీలించాల్సి ఉంటుందని, ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పొద్దని హెచ్చరించారు. భయాందోళనలకు గురిచేసి ఆర్‌టీజీఎస్‌ ద్వారా పలు బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేయించారు. ఐదు నెలల కాలంలో ఆమె నుంచి దాదాపు రూ.24 కోట్లు తీసుకున్నారు.

బంగారం తాకట్టు పెట్టేందుకు వెళ్లడంలో..

ఇంత డబ్బు ఇచ్చిన తర్వాత కూడా మోసగాళ్లు వేధింపులు ఆపలేదు. దీంతో ఇంట్లో ఉన్న 1.3 కిలోల బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టేందుకు ఆమె ICICI బ్యాంక్ కంటోన్మెంట్‌ శాఖకు వెళ్లారు. ఒకేసారి భారీగా బంగారం తాకట్టు పెట్టేందుకు రావడంతో బ్యాంకు మేనేజర్‌ కు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

విచారణలో అసలు విషయం వెలుగులోకి..

పోలీసులు విచారణ చేయగా మొదట మహిళ నిజం చెప్పలేదు. చివరకు వీడియో కాల్స్‌ ద్వారా బెదిరించి డబ్బులు తీసుకున్నారని, ఇప్పటికే కోట్ల రూపాయలు కోల్పోయానని వెల్లడించారు. ఈ ఘటనను పోలీసులు డిజిటల్‌ అరెస్ట్‌ మోసంగా గుర్తించారు.దర్యాప్తు చేపట్టిన సీసీబీ పోలీసులు ముంబై, ఢిల్లీ, పయాగ్ రాజ్  ప్రాంతాల్లో నిందితులను గుర్తించి ఐదుగురిని అరెస్టు చేశారు. వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.3 కోట్లను ఫ్రీజ్‌ చేసి మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు