HomeజాతీయంPathankot Spy Case: రూ.40 వేల కోసం దేశద్రోహం.. పాకిస్థాన్‌కు సమాచారం పంపిన వ్యక్తి అరెస్ట్!

Pathankot Spy Case: రూ.40 వేల కోసం దేశద్రోహం.. పాకిస్థాన్‌కు సమాచారం పంపిన వ్యక్తి అరెస్ట్!

డబ్బు కోసం దేశ రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేస్తున్న ఓ వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. పఠాన్‌కోట్ ప్రాంతంలో భారత సైన్యం, పారామిలిటరీ దళాల కదలికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు పంపుతున్న గూఢచర్య వ్యవహారాన్ని పోలీసులు బయటపెట్టారు.

హైవే మీద సీసీ కెమెరా పెట్టి మరీ ఆర్మీ వివరాల సేకరణ

చక్ ధరివాల్ గ్రామానికి చెందిన బల్జిత్ సింగ్ అలియాస్ బిట్టు అనే వ్యక్తి ఈ దేశద్రోహ చర్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. భారత సైన్యం వాహనాలు, భద్రతా దళాల రాకపోకలను గమనించేందుకు అతడు జాతీయ రహదారి 44పై ఉన్న ఓ వంతెన సమీపంలోని దుకాణంలో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ కెమెరాలో రికార్డ్ అయిన సమాచారాన్ని పాకిస్థాన్‌లో ఉన్న తన హ్యాండ్లర్లకు పంపిస్తున్నాడని దర్యాప్తులో తేలింది. ఈ విషయాన్ని సీనియర్ పోలీస్ అధికారి దల్జిందర్ సింగ్ ధిల్లాన్ వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, తానే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు.

దుబాయ్ నుంచి ఆదేశాలు..

దర్యాప్తులో మరో కీలక విషయం కూడా బయటపడింది. దుబాయ్‌లో ఉన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి సూచనల మేరకు బల్జిత్ పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ పనికి ప్రతిఫలంగా అతడు రూ.40 వేల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. నిందితుడి వద్ద నుంచి సీసీటీవీ కెమెరాతో పాటు వైఫై ఇంటర్నెట్ రౌటర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పఠాన్‌ కోట్-జమ్మూ జాతీయ రహదారిపై అనుమానాస్పద కదలికలపై సమాచారం రావడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే గూఢచర్య వ్యవహారం బయటపడింది. ఈ కేసులో బల్జిత్ సింగ్‌తో పాటు విక్రమ్‌జిత్ సింగ్, బల్విందర్ సింగ్, తరణ్‌ప్రీత్ సింగ్ అనే మరో ముగ్గురిపై కూడా కేసులు నమోదు చేశారు. నిందితులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు పంపినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని పంజాబ్ పోలీసులు వెల్లడించారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు