•పూర్వవైభవం దిశగా తెలుగుదేశం పార్టీ
•పార్టీలో చేరేందుకు సీనియర్ నేతలు సిద్ధం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:-తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేయనుందా? ఈ మేరకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అవుతోందా? ప్రధాని మోదీ పర్యటనతో ఫుల్ క్లారిటీ వచ్చిందా? వచ్చే ఎన్నికల్లో సైతం ఏపీ పొత్తు ఫార్ములా తెలంగాణలో అనుసరించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి.
ఆ రెండు పార్టీలతో పొత్తు..
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం దిశగా ప్రణాళిక రచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బిజెపితో కలిసి టిడిపి, జనసేన వెళ్తాయని తెలుస్తోంది. మొన్న ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇళ్లకు వెళ్లారు. వారితో చర్చలు జరిపారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్లో మార్పు చేస్తూ.. ఇలా నేతల పరామర్శకు వెళ్లడం అంత సులువు కాదు. దీని వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు అర్థం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పొత్తు సంకేతం అని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ప్రారంభం అయింది. ఆ మరుక్షణం తెలుగుదేశం పార్టీ తెలంగాణలో యాక్టివ్ పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
ఆ నేతలంతా యూటర్న్..
ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి అలియాస్ బిఆర్ఎస్ లో తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కువమంది ఉన్నారు. ఆ పార్టీ పరిస్థితి బాగా లేకపోవడంతో నిరాశతో ఉన్నారు. ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగుదేశం పార్టీని క్రియాశీలకం చేస్తే చాలామంది నేతలు ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ మంత్రి బాబూమోహన్ టిడిపిలో చేరేందుకు సిద్ధం గా ఉన్నారు. మరోవైపు హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి సైతం సంసిద్ధంగా ఉన్నారు. నామా నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి లాంటి నేతలు తిరిగి టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి ఖమ్మంతోపాటు నల్గొండ,, గ్రేటర్ హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ బలం తగ్గలేదు. సెటిలర్స్ ఉన్నచోట్ల టిడిపి గట్టిగానే ప్రభావం చూపుతోంది. ఇప్పుడు నేతలంతా పార్టీలోకి వస్తే టిడిపికి పూర్వవైభవం ఖాయమని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో…