నీట్ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ వ్యవహారంలో పుణేకు చెందిన 46 ఏళ్ల బ్యూటీషియన్ మనీషా వాఘ్మారే ప్రధాన పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. ట్యూషన్‌కు వచ్చే విద్యార్థులు, కార్పొరేట్ స్కూళ్లలో పని చేసే టీచర్లతో పరిచయాలు పెంచుకుని ఆమె ఓ నెట్ వర్క్ ను నడిపినట్లు వెల్లడైంది. అదే పరిచయాల ద్వారా నీట్ ప్రశ్నపత్రాన్ని అమ్మే ప్రయత్నం జరిగినట్లు సీబీఐ చెబుతోంది.
మనీషా సమాచారంతోనే ఇతర నిందితుల అరెస్ట్
ఇప్పటికే మనీషా వాఘ్మారేను అరెస్ట్ చేసిన సీబీఐ, ఆమె ఇచ్చిన సమాచారంతో కేసులో మరో ఇద్దరు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. వారిలో నీట్ ప్యానెల్ సభ్యురాలు మనీషా గురునాథ్ మందరే, కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణి ఉన్నారు. ప్రస్తుతం వీరిని కస్టడీలో ఉంచి విచారణ కొనసాగిస్తున్నారు.
ఒక్కో విద్యార్థి నుంచి రూ. 10 లక్షల వసూళు
ఈ ముఠా ఒక్కో విద్యార్థి నుంచి సుమారు రూ.10 లక్షల వరకు వసూలు చేయాలని ప్లాన్ చేసింది. అందులో ప్రతి ఒక్కరికీ దాదాపు రూ.3 లక్షల చొప్పున పంచుకోవాలని ముందే నిర్ణయించుకున్నట్లు సమాచారం. పరీక్షలో మంచి ర్యాంకులు సాధించే అవకాశమున్న విద్యార్థులను గుర్తించే బాధ్యతను వాఘ్మారే తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పథకాన్ని నాసిక్‌లో కౌన్సెలింగ్ బిజినెస్ నిర్వహించే శుభమ్ అనే వ్యక్తితో కూడా ఆమె పంచుకున్నట్లు సీబీఐ తెలిపింది. ఈ నెట్‌వర్క్ ఆధారంగా మహారాష్ట్రలోని లాతూర్‌లో ప్రముఖ కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకుడు శివరాజ్‌ను కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. అతని ఇంట్లో నిర్వహించిన సోదాల్లో లీకైన ప్రశ్నపత్రం లభించినట్లు సమాచారం.
పరీక్షకు 10 రోజుల ముందే పేపర్ లీక్
పరీక్షకు దాదాపు 10 రోజుల ముందే అసలు సూత్రధారుల నుంచి ప్రశ్నలు, సమాధానాలు సేకరించినట్లు దర్యాప్తులో తేలింది. తర్వాత ఎంపిక చేసిన కొంతమంది విద్యార్థులకు వాటిని నోట్‌బుక్‌లలో చేతిరాతతో రాయించి ప్రాక్టీస్ చేయించినట్లు గుర్తించారు. పరీక్ష పూర్తయ్యాక ఆ నోట్‌బుక్‌లను తగలబెట్టి ఆధారాలు లేకుండా చేయాలని ప్రయత్నించినట్లు సీబీఐ వెల్లడించింది.