Jabardasth Ishwarya: జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి వినోద కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఐశ్వర్య తన అందం, క్యూట్‌నెస్, కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న ఈ నటి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, కెరీర్, పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాల గురించి పలు సంచలన విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా తన రిలేషన్‌షిప్ గురించి, కమిట్మెంట్ పేరుతో ఎదురైన ఇబ్బందుల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
‘నాతో నేను’ సినిమా ప్రమోషన్ల సమయంలో చేసిన ఒక స్కిట్ కారణంగా తన రిలేషన్‌షిప్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందని ఐశ్వర్య తెలిపింది. చాలా మంది నిజంగానే తాము ప్రేమలో ఉన్నామని భావించారని, మరికొందరు పెళ్లి కూడా అయిపోయిందని అనుకున్నారని చెప్పుకొచ్చింది. అయితే ఆ బంధం తర్వాత ముగిసిపోయిందని స్పష్టం చేసింది. ప్రేమ అనేది జీవితంలో చాలా విలువైనదని, కానీ దానికి అర్హత లేని వ్యక్తులు జీవితంలోకి వస్తే ఆ బంధం నిలబడదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా చాలా సంతోషంగా ఉన్నానని చెప్పిన ఐశ్వర్య.. ఈ దశలో పెళ్లి పట్ల పెద్దగా ఆసక్తి లేదని వెల్లడించింది. తన తల్లి చూసిన సంబంధాన్ని చేసుకోవడానికి సిద్ధమేనని, అయితే ముందుగా ఇంటి పరిస్థితులు పూర్తిగా సెట్ కావాలని కోరుకుంటున్నానని తెలిపింది.
సినీ పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాలను కూడా ఆమె ఈ సందర్భంగా బయటపెట్టింది. కథ వినడానికి వెళ్లినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని, కానీ అగ్రిమెంట్‌కు ముందు రోజు కొంతమంది నిర్మాతలు, దర్శకులు ఫోన్ చేసి వ్యక్తిగతంగా మాట్లాడే ప్రయత్నం చేసేవారని పేర్కొంది. కొందరు ‘క్రష్ ఉంది’, ‘ఇంట్రెస్ట్ ఉంది’ అంటూ మాట్లాడేవారని చెప్పింది. ఒకసారి ఓ దర్శకుడు నేరుగా ‘కమిట్మెంట్’ గురించి మాట్లాడిన సందర్భాన్ని కూడా ఆమె గుర్తు చేసుకుంది. ఆ సమయంలో తనకు ఆ పదానికి సినీ పరిశ్రమలో ఉన్న అసలు అర్థం తెలియక, తాను పని విషయంలో చాలా కమిట్మెంట్‌తో, కష్టపడి పనిచేస్తానని సమాధానం ఇచ్చినట్లు తెలిపింది. తర్వాత దాని వెనుక ఉన్న ఉద్దేశం అర్థమయ్యాక తీవ్ర ఆవేదనకు గురయ్యానని చెప్పింది. ఒక దర్శకుడు అదే విషయాన్ని మరోసారి ప్రస్తావించడంతో కోపంతో అతడిని కొట్టి అక్కడి నుంచి బయటికి వచ్చానని వెల్లడించింది.
టీవీ షోలు, సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నిరంతరం పనిచేస్తున్నప్పటికీ తనకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదని ఐశ్వర్య ఆవేదన వ్యక్తం చేసింది. మంచి కథలు వచ్చినప్పటికీ, షూటింగ్ పూర్తయ్యాక 24 విభాగాల్లో ఎక్కడో లోపం జరగడం లేదా దర్శకుడు కథను సరిగా ప్రేక్షకులకు చేరవేయలేకపోవడం వల్ల ఫలితం ఆశించిన విధంగా రాకపోవచ్చని చెప్పింది. ‘కేరాఫ్ బాయ్స్ కేరాఫ్ గర్ల్స్’ కార్యక్రమం నుంచి తన ఎలిమినేషన్ కూడా తనను బాధపెట్టిందని తెలిపింది. ఒప్పందంలో ఎలిమినేషన్ల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని, మొదట ఇద్దరిని, తర్వాత ఒకరిని తొలగించి ప్రేరణను తీసుకురావడం తనకు అర్థం కాలేదని పేర్కొంది.
భవిష్యత్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం ‘కామాఖ్య’ అనే సినిమాలో మంచి పాత్రలో నటిస్తున్నానని ఐశ్వర్య తెలిపింది. అలాగే ప్రముఖ వేదిక ప్రైమ్ కోసం శోభితతో కలిసి చేసిన ఒక సినిమా ఇప్పటికే విడుదలైందని చెప్పింది. అయితే ‘దేవి అండ్ డాని’ సినిమాలో తన సన్నివేశాల్లో చాలా భాగం కట్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్‌లో నటిస్తున్నానని, తన యూట్యూబ్ ఛానెల్ ‘ఐషు ముచ్చట్లు’ కోసం కూడా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నానని వెల్లడించింది. తనకు బిగ్ బాస్ అవకాశం కూడా వచ్చిందని, ఇంటర్వ్యూలు జరిగినప్పటికీ చివరికి ఎందుకు ఎంపిక కాలేదో తెలియదని చెప్పింది. బిగ్ బాస్ కార్యక్రమం అంటే తన తల్లి, తమ్ముడికి చాలా ఇష్టమని, వారి కోసమైనా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఉందని చెప్పుకొచ్చింది.
ALSO READ: ఐపీఎల్ టికెట్ల స్కామ్‌లో దిమ్మతిరిగే నిజాలు!