క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : భారతీయ జనతా పార్టీ తదుపరి టార్గెట్ తెలంగాణ. ఎలాగైనా అక్కడ అధికారంలోకి రావాలి అనేది మోదీ, అమిత్ షా లక్ష్యం. అందుకోసం గట్టి ప్రయత్నాలు చేశారు కానీ వర్కౌట్ కాలేదు. తెలంగాణను తెచ్చిన పార్టీగా టిఆర్ఎస్కు అవకాశము ఇచ్చారు ప్రజలు రెండుసార్లు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు సైతం చాన్స్ ఇచ్చారు. అయితే తమకు ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని చెబుతోంది భారతీయ జనతా పార్టీ. గత కొంతకాలంగా తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఓట్లతో పాటు సీట్లు పెంచుకుంటూ వచ్చింది. కానీ ఈసారి మాత్రం ఏకంగా అధికారం పై గురి పెట్టింది.
మనసు పెడితే అంతే…
ఏదైనా రాష్ట్రంపై బీజేపీ మనసు పెడితే కచ్చితంగా కొల్లగొడుతుంది. ఈ విషయం పశ్చిమ బెంగాల్లో అర్థం అయింది. గతసారి ప్రయత్నం చేసిన పార్టీ అనుకున్నది సాధించలేకపోయింది. రెండోసారి ఫోకస్ చేసి.. వ్యూహాలు అమలు చేసి అధికారంలోకి రాగలిగింది. అదే ఫార్ములాతో తెలంగాణలో సైతం ముందుకు వెళ్లాలని చూస్తోంది. అందుకే రేపు పచ్చిమ బెంగాల్లో ప్రభుత్వం కొలువు దీరిన మరుక్షణం తెలంగాణ వైపు అడుగులు వేయనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈనెల 10న గ్రేటర్ హైదరాబాదులో పర్యటించనున్నారు.
అంతా వ్యూహంతోనే…
తెలంగాణ విషయంలో పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది భారతీయ జనతా పార్టీ. ప్రస్తుతం ఆ పార్టీకి తెలంగాణలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో బిజెపి ఊపు ను తెలంగాణలో సైతం కొనసాగించాలని చూస్తోంది. అందుకు తగ్గట్టు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటుంది. ప్రధానంగా మోదీ పై ఆశలు పెట్టుకుంది. మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఆయన తెలంగాణలో తొలిసారిగా పర్యటిస్తున్నారు. భారీగా అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయనున్నారు. అభివృద్ధి అజెండాతో తెలంగాణ ప్రజల మనసును గెలవాలని చూస్తున్నారు. దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులకు ఈ పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
ఎదురుచూపు…
తెలంగాణ సమాజం ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఏం చెబుతారు అనేదానిపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది. హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ జరగనుంది. బిజెపి తెలంగాణ వ్యాప్తంగా జన సమీకరణ చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో దూకుడు మీద ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ సభలో ఎవరిని టార్గెట్ చేసుకుంటారు అనేది హాట్ టాపిక్ అవుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీ పై ఎలా ను విరుచుకుపడతారు. అయితే కెసిఆర్ పై విమర్శలు ఉంటాయా? ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీతో బిజెపికి పొత్తు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే కెసిఆర్ పై విమర్శలు చేస్తారా? లేదా? అనే దానిపై కూడా అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో అడుగుపెట్టిన తర్వాత రాజకీయ మార్పులు ఖాయమని పొలిటికల్ పండిట్స్ చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో