క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: బీజేపీ తెలంగాణపై ఫోకస్ పెట్టిందా? పశ్చిమ బెంగాల్ గెలుపుతో తదుపరి టార్గెట్ తెలంగాణయేనా? 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు ప్రారంభించిందా? కేంద్ర నాయకత్వం వ్యూహాలను అమలు చేయనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి.
చారిత్రాత్మక విజయం…
బెంగాల్లో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది భారతీయ జనతా పార్టీ. ఆ మరుక్షణం తన పూర్తి దృష్టిని తెలంగాణ పై మళ్లించినట్లు తెలుస్తోంది. బెంగాల్లో మమతా బెనర్జీ కోటలను బద్దలు కొట్టింది బిజెపి. ఆ ఉత్సాహంలో ఉన్నారు కమలనాధులు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే పశ్చిమ బెంగాల్ కంటే భిన్నమైన రాజకీయ వాతావరణం ఉంటుంది తెలంగాణలో. ఆ తేడాను అనుసరించి వ్యూహాలు రూపొందించగలిగితే తెలంగాణ బిజెపికి పట్టు చిక్కడం ఖాయం. ప్రస్తుతం దేశంలో 20 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంది. 9 రాష్ట్రాల్లో మాత్రమే ఇతరులు అధికారంలో ఉన్నారు. తెలంగాణలో పాగా వేసి ఆ సంఖ్యను తగ్గించుకోవాలని చూస్తోంది బిజెపి.
ప్రధాని పర్యటన …
తెలంగాణపై వ్యూహంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో కీలక పర్యటన చేయనున్నారు. ఈ నెల 10న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన బిజెపికి అత్యంత ప్రతిష్టాత్మకం. దాదాపు 8 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అక్కడి నుంచి ఆయన ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. పనిలో పనిగా ప్రధాని టూర్ లో బిజెపి నేతలకు దిశ నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలో అంతర్గత కలహాలకు చెక్ పెట్టే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉండనున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేలా ఆయన రోడ్డు మ్యాప్ ఉండనుందని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.
విభేదాలకు చెక్…
తెలంగాణ బిజెపి నేతలు అభిప్రాయ భేదాలు, సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీలో కొత్తగా వచ్చిన నేతలు, పాత నేతల మధ్య విభేదాల పర్వం కొనసాగుతోంది. పైగా రాష్ట్ర నాయకత్వం పై కొన్ని రకాల ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అయితే పశ్చిమ బెంగాల్లో అలా కాదు. నేతలంతా ఏకతాటిపైకి వచ్చి మమతా బెనర్జీ పై గట్టి పోరాటం చేశారు. అక్కడ బూత్ స్థాయిలో కూడా పటిష్టమైన యంత్రాంగం నిర్మించారు. అదే పరిస్థితి తెలంగాణలో తేవాలన్నది బిజెపి హై కమాండ్ ఆలోచన. గ్రామీణ స్థాయిలో రైతుల సమస్యలు, నిరుద్యోగం వంటి అంశాలపై ప్రజల పక్షాన పోరాడేలా నాయకత్వాన్ని సిద్ధం చేయాల్సిన అవసరం బిజెపి పెద్దలపై ఉంది.
కేవలం హిందుత్వ కార్డు పైనే ఆధారపడకుండా.. స్థానిక అంశాలను గౌరవిస్తూనే అభివృద్ధి అజెండాను ముందుకు తీసుకెళ్లాలి. గత కెసిఆర్ పాలనలో వైఫల్యాలను.. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో ఎదురవుతున్న పరిణామాలను ఎండగడుతూ.. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బిజెపి అవసరం అని అక్కడి ప్రజలు గుర్తించేలా వ్యూహాల రూపొందించాల్సిన అవసరం ఉంది. అప్పుడే బిజెపికి మిషన్ తెలంగాణ సాధ్యం.