HomeజాతీయంM. K. Stalin: సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా.. గవర్నర్ ఆమోదం!

M. K. Stalin: సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా.. గవర్నర్ ఆమోదం!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) అనూహ్యంగా ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఆయన గవర్నర్ R. N. రవిని కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించగా, గవర్నర్ వెంటనే దాన్ని ఆమోదించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయనను కోరారు.

విజయ్ పార్టీ జయకేతనం

ఇటీవల జరిగిన 2026 ఎన్నికల్లో నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 234 స్థానాల్లో టీవీకే 108 సీట్లు గెలుచుకోగా, అధికారంలో ఉన్న డీఎంకే కేవలం 59 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద షాక్‌గా భావిస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో కూడా ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి చేతిలో ఆయన భారీ ఓట్ల తేడాతో పరాజయం ఎదురైంది. ఈ పరిణామం డీఎంకేకు మరింత దెబ్బగా మారింది.

సోషల్ మీడియా వేదికగా స్పందించిన స్టాలిన్

రాజీనామా అనంతరం స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని, గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని తెలిపారు. తమకు మద్దతు తెలిపిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇకపై పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు మిత్రపక్షాలైన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులతో సమావేశం కావాలని నిర్ణయించారు.

ఈ ఎన్నికల ఫలితాలతో తమిళనాడులో చాలా కాలంగా కొనసాగుతున్న డీఎంకే-ఏఐఏడీఎంకే ఆధిపత్యానికి ముగింపు పలికినట్టైంది. మరోవైపు టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. పూర్తి మెజారిటీకి ఇంకా కొన్ని సీట్లు అవసరమవడంతో, ఇతర చిన్న పార్టీల మద్దతు పొందేందుకు చర్చలు కొనసాగిస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు