HomeతెలంగాణBIG BREAKING: రాజగోపాల్ రెడ్డి జంప్...?

BIG BREAKING: రాజగోపాల్ రెడ్డి జంప్…?

  • ఈసారి మంత్రి పదవి దక్కకపోతే అంతే?

  • సీఎం రేవంత్ రెడ్డితో తీవ్రమైన విభేదాలు

  • ఇటీవల కేసీఆర్ కు అనుకూలంగా వ్యాఖ్యలు

  • కేటీఆర్ తో ఉల్లాసంగా మాటా మంతీ

  • కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కారెక్కే యోచన?

Crime Mirror, Munugodu: నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. మంత్రి పదవి కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్న ఈ సీనియర్ నేత.. అది ఎంతకీ దక్కకపోతుండడంతో తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. వివిధ సమీకరణాల వల్ల మంత్రి పదవి రాకపోవడం పట్ల ఆక్రోశంతో ఉన్నారు. కాంగ్రెస్ లో తన కోరిక తీరే అవకాశం లేకపోవడంతో.. ఇక ఆ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకున్న విభేదాలను రాజగోపాల్ రెడ్డికి ఇప్పటికే పలుమార్లు బయటపెట్టుకున్నారు. సొంత పార్టీ ప్రభుత్వంపైనే బహిరంగంగా విమర్శలు చేశారు.

దీనికితోడు కొంతకాలంగా ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడుతుండడంతోపాటు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో స్నేహపూరితంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డి గులాబీ గూటికి చేరతారన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచీ కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో లోక్ సభ సభ్యుడిగా ఉండి.. ఢిల్లీలో తెలంగాణ గళాన్ని గట్టిగా వినిపించారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలతో కలిసి పోరాటాల్లో ముందున్నారు. రాష్ట్రంలోనూ నాటి టీఆర్ఎస్ కు పోటీగా కాంగ్రెస్ తరఫున ఉద్యమాన్ని నడిపించడంలో తన వంతు పాత్ర పోషించారు. తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే తమకు సముచిత స్థానం లభిస్తుందని భావించారు.

ప్లస్సూ, మైనస్సూ అన్నయ్యే..
రాజగోపాల్ రెడ్డి రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి, కాంగ్రెస్ నుంచి ఎంపీ గెలవడానికి తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డే కారణం. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో వెంకట్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనే రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇమేజ్ ను సంపాదించుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత నుంచే రాజగోపాల్ రెడ్డికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ వస్తున్నాయి. వరుసగా రెండు పర్యాయాలు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. దీంతో పదేళ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంది.

ఆ సమయంలో తాము పార్టీని సమర్థవంతంగా నడిపిస్తామని, తమ సోదరుల్లో ఒకరికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని రాజగోపాల్ డిమాండ్ చేశారు. కానీ, అధిష్ఠానం వీరిని పట్టించుకోకపోవడంతో.. చివరకు బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల బరిలో దిగారు. కానీ, ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. దీంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన రాజగోపాల్.. మునుగోడు నుంచి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ లో చేరేముందే మంత్రి పదవిపై అధిష్ఠానం నుంచి హామీ తీసుకున్నారు. కానీ, పరిస్థితులు ఆయనకు అనుకూలించడంలేదు.

మళ్లీ తెరపైకి సమీకరణాలు..
త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన జరగనున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో ఈసారైనా తనకు బెర్తు దక్కుతుందన్నఆశాభావంతో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. కానీ, మళ్లీ కుటుంబ సమీకరణాలు, సామాజిక సమీకరణాలు తెరపైకి వస్తుండడంతో ఈసారి ఆయన బీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం మొదలైంది. పైగా, కేసీఆర్ కుమార్తె కవిత ఇటీవల కొత్త పార్టీ పెట్టిన సందర్భంగా తన తండ్రిపై చేసిన వ్యాఖ్యలను రాజగోపాల్ రెడ్డి ఖండించారు. కేసీఆర్ ను కొనియాడుతూ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఇటీవల ఓ కార్యక్రమంలో కేటీఆర్ తో కలిసి ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు.

ఈ పరిణామాలను గమనిస్తే రాజగోపాల్ రెడ్డి అడుగులు బీఆర్ఎస్ వైపు పడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున.. వెంటనే పార్టీ మార్పు ఉండకపోవచ్చునని, ఎన్నికలకు ఏడాది ముందు మారవచ్చునని అంటున్నారు. కాంగ్రెస్ లో తన అన్న ఉన్నందున.. ఇక ఎప్పటికీ ఇలాంటి పరిస్థితులే ఉంటాయని ఆయన భావిస్తున్నట్టు, ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న్టట్టు ప్రచారం జరుగుతోంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు