-
చుట్టూ బిగిస్తున్న ఉచ్చు
-
బాధితులంతా అమాయక గిరిజనులే
-
దర్యాప్తులో కీలక ఆధారాలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: సింగర్ మంగ్లీ చుట్టూ ఇప్పుడు వివాదం మరింత ముదురుతోంది. ఆమెపై అభియోగాలు పెరుగుతున్నాయి. గిరిజన మూలాలు చాటుకుంటూ సామాన్య ప్రజల గుండెల్లో గాయనిగా చోటు దక్కించుకున్నారు మంగ్లీ. అయితే ఇప్పుడు అదే గిరిజన బిడ్డలను మోసం చేసినట్లు ఆమెపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. మైక్రో ఫైనాన్స్ కుంభకోణంలో మంగ్లీ తో పాటు ఆమె సోదరుడు, శివ చౌహన్ ప్రధాన సూత్రధారులుగా ఉన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా గిరిజన తండాల్లో ఉండే అమాయకులను టార్గెట్ చేసుకొని అధిక వడ్డీలు, సినిమా ఫైనాన్స్ ఇన్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేశారన్నది వారిపై ఉన్న ఆరోపణ. ఇప్పుడు ముఖం చాటేస్తుండడంతో బాధితులుగా ఉన్న గిరిజన బిడ్డలు తిరగబడుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో మరింత వివాదాస్పదమవుతోంది ఈ అంశం.
చురుగ్గా దర్యాప్తు..
మరోవైపు సింగర్ మంగ్లీ పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పోలీసు విచారణ ప్రారంభం అయింది. దర్యాప్తులో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు రమావత్ మధు అకౌంట్ నుంచి మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంక్ ఖాతాలోకి.. మూడు విడతలుగా పెద్ద మొత్తంలో నగదు బదిలీ అయినట్లు సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం ప్రాథమికంగా గుర్తించింది. ఇలా నగదు జమ అయిన రోజే ఆ మొత్తాన్ని విత్ డ్రా చేసినట్లు బ్యాంక్ లావాదేవీలు చెబుతున్నాయి. అయితే నిందితులతో తమకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ బహిరంగంగా చెబుతున్నారు. కానీ తెర వెనుక జరిగిన వ్యవహారాలతో ఆమె వాదనలు కరెక్ట్ కాదు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కుటుంబం పై ఆరోపణలు..
అయితే వీరి చేతిలో మోసపోయిన వారంతా గిరిజనులే. గిరిజన వర్గాలకు చెందిన సామాన్యులే. న్యాయవాది సుబ్బారావు ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ స్కాం లో మంగ్లీ కేవలం బ్రాండ్ అంబాసిడర్ గానే కాదు. తెర వెనుక ఆర్థిక లావాదేవీల్లో కూడా కీలక పాత్ర పోషించినట్లు సాక్షాలు చెబుతున్నాయి. బాధితులను బెదిరించడం, నోరు నొక్కే ప్రయత్నం చేయడం వంటి ఆరోపణలు సభ్యులపై వస్తున్నాయి. ప్రస్తుతం మంగ్లీ తో పాటు ఆమె సోదరుడి బ్యాంక్ అకౌంట్ లను తనిఖీ చేసే పనిలో ఉన్నారు దర్యాప్తు అధికారులు. సమాజంలో సెలబ్రిటీ హోదాలో ఉన్న మంగ్లీ దానిని ఆసరాగా చేసుకుని షేర్ మైక్రో ఫైనాన్స్ వ్యాపారంలో దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. రోజురోజుకు వీరి బాధితులు వెలుగులోకి వస్తున్నారు. ఆధారాలతో సహా మోసాన్ని బయటపెడుతున్నారు. దీంతో మంగ్లీ చట్టం ముందు నిలబడడం ఖాయమని తెలుస్తోంది.