Padman Nominated for Nobel Prize: తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన అరుణాచలం మురుగానందం మరోసారి వార్తల్లో నిలిచారు. మహిళల కోసం తక్కువ ఖర్చుతో శానిటరీ నాప్ కిన్లు అందుబాటులోకి తీసుకువచ్చిన ఆయన పేరు ఇప్పుడు నోబెల్ బహుమతి రేసులో చేరింది. మహిళల ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను గుర్తించిన మురుగానందం, చాలా తక్కువ ఖర్చుతో నాప్‌కిన్లు తయారు చేసే యంత్రాన్ని అభివృద్ధి చేశారు. ఈ యంత్రాల ద్వారా మహిళలు స్వయంగా నాప్‌కిన్లు తయారు చేసుకుని వినియోగించుకునేలా మార్గం సుగమం చేశారు. దీంతో వేలాది మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా లభించాయి.
‘ప్యాడ్ మ్యాన్’ సినిమాతో దేశ వ్యాప్త గుర్తింపు
ఆయన జీవిత కథ ఆధారంగా తీసిన ‘ప్యాడ్ మ్యాన్’ సినిమా దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించడంతో మురుగానందం చేసిన పని మరింతగా ప్రజల్లోకి వెళ్లింది. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచడంలో ఈ సినిమా కూడా కీలక పాత్ర పోషించింది.
నోబెల్ నామినేషన్ జాబితాలో మురుగానందం
ఈ ఏడాది నోబెల్ బహుమతికి మొత్తం 200కిపైగా వ్యక్తులు, అలాగే అనేక సంస్థల పేర్లు సిఫారసు చేయబడ్డాయి. ఆ జాబితాలో మురుగానందం పేరు కూడా చోటు దక్కడం ఆయన కృషికి లభించిన గౌరవంగా భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. తాను అభివృద్ధి చేసిన సాంకేతికతను కేవలం భారతదేశానికే పరిమితం చేయకుండా, యూరప్ సహా దాదాపు 40 దేశాలకు విస్తరించామని చెప్పారు. అలాగే దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ, మహిళల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.