-
బుకింగ్ చేసినా 15 రోజులు ఆలస్యం
-
సింగిల్ సిలిండర్ కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు
-
ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్న ప్రజలు
-
బ్లాక్ మార్కెట్లో అధిక ధరలు
-
బుకింగ్ వ్యవస్థలో సాంకేతిక అంతరాయం
మిర్యాలగూడ, క్రైమ్ మిర్రర్: పట్టణంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యలు రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ముఖ్యంగా ఒకే సిలిండర్‌పై ఆధారపడే కుటుంబాలు గ్యాస్ అందక ఇబ్బందులు పడుతున్నాయి. పట్టణంలోని Indian Oil Corporation కు చెందిన గ్యాస్ ఏజెన్సీల వద్ద బుకింగ్ చేసిన సిలిండర్లు సమయానికి అందకపోవడం ప్రధాన సమస్యగా మారింది. సాధారణంగా వారం రోజుల్లో సరఫరా చేస్తామని చెబుతున్నప్పటికీ, వాస్తవంగా 12 నుంచి 15 రోజుల వరకు ఆలస్యం అవుతోందని వినియోగదారులు చెబుతున్నారు.
గ్యాస్ పూర్తిగా అయిపోయిన తర్వాత ప్రత్యామ్నాయం లేక వంట పనులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంటోంది. దీంతో గృహిణులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో బ్లాక్ మార్కెట్లో సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి. అత్యవసర పరిస్థితుల్లో రూ.2000 నుంచి రూ.2500 వరకు చెల్లించి సిలిండర్ కొనాల్సి వస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇంకా, గ్యాస్ బుకింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్యలు కూడా వినియోగదారులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొంతమందికి బుకింగ్ నమోదు కాకపోవడం, మరికొందరికి డెలివరీ ఆలస్యం అవ్వడం జరుగుతోంది. ఈ పరిస్థితిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించి, బుక్ చేసిన సిలిండర్లు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.